రాత్రి వేళ ముమ్మర గస్తీ
పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా పోలీసులు రాత్రివేళ ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తూ వాహనాలు తనిఖీ చేపడుతున్నారు. చోరీల నియంత్రణ, అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు అప్నమత్తమయ్యారు. రాత్రివేళ ముమ్మరంగా గస్తీలు చేపడుతూ నైట్ బీట్ చెకింగ్‌లు ఏర్పాటు చేసి అనుమానితు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై ప్రత్యేకడ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహణ కలిగిస్తున్నారు. గంజాయి, అక్రమ మద్యం రవాణా, నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు చేస్తున్నారు. గ్రామాలను సందర్శించి గొడవలకు వెళ్లకుంగా ప్రశాతంగా జీవించాలని అవగాహన కల్పిస్తున్నారు.
నేడు కలెక్టరేట్‌లో
ప్రజా సమస్యల పరిష్కారవేదిక
ప్రశాంత నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో విన్నవించుకోవచ్చని సూచించారు.
ఎస్పీ కార్యాలయంలో..
పుట్టపర్తి టౌన్: ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. అర్జీదారులు తమ ఆధార్‌కార్డును తప్పని సరిగా వెంట తీసుకుని రావాలని ఎస్పీ రత్న సూచించారు.
జిల్లా అండర్–12
క్రికెట్ జట్టు ఎంపిక
అనంతపురం: నగరంలో ఆదివారం జిల్లా అండర్–12 బాలుర క్రికెట్ జట్టును ఎంపిక చేశారు. సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా కమలాకర్ నాయుడు, సభ్యులుగా ఎస్‌ఎల్‌ఎన్ ప్రసాద్, ఎం. భార్గవ్ ఉన్నారు. ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు కడపలో జరగనున్న సౌత్ జోన్ మ్యాచ్‌లో ఈ జట్టు ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు.
జట్టులో చోటు దక్కించుకున్న వారు వీరే:
హవీష్ రెడ్డి, ఏ. హేమచంద్రా నాయక్, జి. ధనుష్, జై వీర్ రెడ్డి, ఎం. తమోగ్న, లలిత్ కిశోర్, రోహితేశ్వర రాజు, చరణ్ తేజ్ (అనంతపురం), రామ్ చరణ్ (హిందూపురం), బి. ఉత్తేజ్ యాదవ్, ఎస్కే ఇస్మాయిల్ (గుంతకల్లు), బీఎం మోక్షజ్ఞ తేజ (కళ్యాణదుర్గం), టి. గణేష్ (ధర్మవరం),బృందావన్, ఎస్. వెంకట లిఖిత్ రెడ్డి (తాడిపత్రి). స్టాండ్ బై (కుషాల్ రాయల్, అనంతపురం), కమ్రణ్ ఫహద్ (హిందూపురం), మన్నన్ లలిత్ సాయి (అనంతపురం), ఎం. రాజా (ధర్మవరం), బి. ప్రజ్వల్ (నార్పల).
సంతల్లో వసూళ్ల పర్వం
అనంతపురం అగ్రికల్చర్: అనంతపురం వ్యవసాయ మార్కెట్‌యార్డులో వసూళ్ల పర్వం సాగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కొందరు ప్రబుద్ధులు దందాకు తెరలేపారు. మార్కెట్ యార్డులో ప్రతి శని, ఆదివారం జరిగే జీవాలు, పశువుల సంతను పలువురు ‘పచ్చ’ నేతలు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకుంటూ దోచేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడుతో పాటు ఇతర జిల్లాలకు జీవాలు, పశువులు తరలిస్తున్న క్రయ విక్రయదారులు, వాహనదారులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంచుకోవడంలో తేడాలొచ్చి బాహాబాహీకి దిగుతున్నారు. ఇక.. ‘పచ్చ’ నేతలతో పాటు మున్సిపాల్టీ వాళ్లమంటూ కొందరు, పోలీసు వాళ్ల మంటూ ఇంకొందరు, మీడియా వాళ్ల మంటూ మరికొందరు ఇష్టారాజ్యంగా డబ్బులు లాగుతుండటంతో రైతులు, వ్యాపారులు, వాహనదారులు, జీవాల పెంపకందారులు గగ్గోలు పెడుతున్నారు. కూటమి సర్కారు వచ్చిన తర్వాత మార్కెట్ యార్డు సంతల్లో ‘బాదుడు’కు దిగింది. గతంలో ఒక్కో గొర్రెకు వసూలు చేసే రుసుంరూ.30 నుంచి రూ.50కు, ఒక్కో పశువుకు రూ.100 నుంచి రూ.200 ప్రకారం పెంచింది. సర్కారు చర్యలతో ఇప్పటికే ఇబ్బంది పడుతుండగా.. ఈ నేపథ్యంలోనే కొందరు వసూళ్లకు తెరతీయడంతో సంతలకు వచ్చే వారు అల్లాడిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment