ఆర్ట్స్ కళాశాల డిగ్రీ సెమిస్టర్ ఫలితాల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో గత నవంబరులో నిర్వహించిన డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఎస్కేయూ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ రమణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లోకేష్, కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ చేతుల మీదుగా కళాశాలలో విడుదల చేశారు. మూడో సెమిస్టర్ ఫలితాల్లో బీఏలో 71 శాతం, బీకాంలో 62 శాతం, బీఎస్సీలో 68 శాతం, బీబీఏలో 83 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఐదో సెమిస్టర్‌లో బీఏలో 88 శాతం, బీకాంలో 81 శాతం, బీఎస్సీలో 80 శాతం, బీబీఏలో 92 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రామకృష్ణ, పరీక్షల విభాగం అధికారులు చలపతి, శ్రీనివాసులు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ
సదరం సర్టిఫికెట్లు
● కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం
ప్రశాంతి నిలయం: అర్హులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సదరం సర్టిఫికెట్లు జారీ చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులతో మంచంపట్టి రూ.15 వేలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పొందుతున్న వారి ధ్రువీకరణ పత్రాల పరిశీలన అంశంపై చర్చించేందుకు శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ చేతన్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సదరం శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకున్న వారిలో అర్హులుగా తేలిన వారందరికీ వెంటనే సర్టిఫికెట్లు అందించాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచానికే పరిమితమై రూ.15 వేలు పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారుల సదరం సర్టిఫికెట్ల పరిశీలన కోసం జిల్లా స్థాయిలో స్పెషలిస్ట్ వైద్యులతో బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వారానికి మూడు రోజులు బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌లో ధ్రువీకరణ పత్రాలను పరిశీలన కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసరావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫిరోజ్ బేగం, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ తిప్పేంద్ర నాయక్, తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ గురుకులాల
డీసీఓగా జయలక్ష్మి
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల (అంబేడ్కర్ గురుకులాలు) ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి (డీసీఓ)గా కె.జయలక్ష్మి శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. నెల్లూరులో ఇన్‌చార్జ్ డీసీఓగా పని చేస్తున్న కె.జయలక్ష్మికి రెగ్యులర్ పదోన్నతి కల్పిస్తూ ఇక్కడికి బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment