కూటమి నేతల దౌర్జన్యం
ధర్మవరం రూరల్: అధికారం అండ చూసుకుని కూటమి నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యంగా తమ పట్టా భూముల నుంచి ఇసుకను తరలిస్తున్నారని ధర్మవరం మండలం పోతులనాగేపల్లికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతులు కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, పుల్లారెడ్డి, హనుమంతరెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామంలోని సర్వే నంబర్ 326–8లో ఇసుక భూములు ఉన్నాయన్నారు. ఈ భూముల్లో దౌర్జన్యంగా యంత్రాలను ఏర్పాటు చేసి కూటమి నాయకులు నరేష్, శీన, నరసింహులు, రామాంజనేయులు, రమేష్, ప్రభాకర్, ధనశేఖర్ రేయింబవళ్లూ ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్నారు. అడ్డుకోబోయిన తమపై దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. ఈ విషయమై ఇప్పటికే ఆర్డీఓ, పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ తరలింపులు అడ్డుకుని తమ భూములను పరిరక్షించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment