నకిలీ నోట్ల ముఠా అరెస్ట్
పుట్టపర్తి టౌన్: నకిలీ నోట్ల చలామణి కేసులో కర్ణాటక ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ, ఒరిజినల్ నోట్లతో పాటు రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ రత్న కదిరి రూరల్ అప్‌గ్రేడ్ స్టేషన్ సీఐ నిరంజన్‌రెడ్డితో కలిసి మీడియాకు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన నలుగురు యువకులు నకిలీ నోట్ల చలామణితో సులువుగ డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకు గొర్రెల వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని పని మొదలు పెట్టారు. ఈ క్రమంలో జనవరి ఏడో తేదీన తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి మార్కెట్ యార్డ్‌లో ఇద్దరు వ్యక్తుల వద్ద రెండు పొట్టేళ్లను రూ.30 వేలకు కొనుగోలు చేసి, రూ.500 నోట్లు 60 ఇచ్చి వెళ్లిపోయారు. అయితే ఆ నోట్లు నకిలీవని గుర్తించిన బాధితులు అదేరోజు సాయంత్రం కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టీం రంగంలోకి దిగింది. సీసీ టీవీ ఫుటేజీలు సేకరించి.. సాంకేతిక ఆధారాలు విశ్లేషించి.. నిందితులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇస్లావత్ పిరోలీనాయక్, దుంగావత్ రవినాయక్, ఎం.వి.ఆనంద్‌నాయక్, ఆదినారాయణ నాయక్‌గా గుర్తించారు. వీరిని మంగళవారం కుమ్మరవాండ్లపల్లి మార్కెట్ వద్ద అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.30వేల నకిలీ నోట్లు, రూ.20,500 ఒరిజినల్ నోట్లతో పాటు రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ముఠాలో కీలక సభ్యుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. నిందితుల అరెస్టులో కీలకంగా వ్యవహరించిన సీఐ నిరంజన్‌రెడ్డి, సిబ్బంది విజయభాస్కర్, షాహీన, దామోదర్, కుమార్ నాయక్‌ను ఎస్పీ అభినందించి, క్యాష్ రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
నకిలీ, ఒరిజనల్ నోట్లు, బైక్‌ల స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment