ముళ్ల పొదల్లో పసికందు
బత్తలపల్లి: తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందు ముళ్ల పొదల్లో ప్రత్యక్షమైంది. ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఉన్న పసికందును కుక్కలపాలవకుండా ఓ వృద్ధురాలు రక్షించింది. అనంతరం స్థానికంగా నివాసముంటున్న దంపతులు శిశువును అక్కున చేర్చుకున్నారు. మండల కేంద్రం బత్తలపల్లిలోని మారుతీనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బీసీ గురుకుల పాఠశాల వెనుక.. అంగన్‌వాడీ కేంద్రం పక్కన గల ముళ్ల పొదల సమీపంలో మంగళవారం ఓ వృద్ధురాలు చెత్త ఊడుస్తోంది. ఆ సమయంలో కొన్ని కుక్కలు అటుగా వచ్చి ప్లాస్టిక్ కవర్ మూటను తెరిచే ప్రయత్నం చేశాయి. వృద్ధురాలు గమనించి వాటిని తరిమి.. కవర్‌ను కదిపితే బరువుగా అనిపించింది. ఆమె స్థానికంగా ఉన్న ఓ ముస్లిం దంపతులను అక్కడకు తీసుకొచ్చింది. వారు ఆ కవర్‌ను తెరవగా మాయతో పాటు రక్తపు మరకలతో ఉన్న మగ శిశువు కనిపించింది. వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు శిశువును శుభ్రం చేశారు. బరువు తక్కువ(1.5 కిలోలు)గా ఉన్న శిశువు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో సీపీఆర్ చేసి వెంటిలేటర్ అమర్చారు. అనంతరం శిశువు దొరికిన విషయాన్ని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ చంద్రమ్మకు చేరవేశారు. తమకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారని, ఈ మగ శిశువును తాము పెంచుకుంటామంటూ ముస్లిం దంపతులు ముందుకొచ్చారు.
గుర్తించిన వృద్ధురాలు
అక్కున చేర్చుకున్న ముస్లిం దంపతులు
ఈ పాపం ఎవరిది?
అప్పుడే పుట్టిన శిశువును ముళ్లపొదల్లో పడేయడంపై ప్రజలు మండి పడుతున్నారు. పెళ్లికి ముందే గర్భం దాల్చి ప్రసవమై సమాజానికి సమాధానం చెప్పలేక ఇలా వదిలించుకున్నారా.. లేక పసికందును ఎవరైనా తీసుకొచ్చి పడేశారా.. అన్నది తెలియడం లేదు. ఏది ఏమైనా కర్కశంగా ఇలా పసికందును పడేయడమేంటని శాపనార్థాలు పెడుతున్నారు. వృద్ధురాలు గమనించకపోయి ఉంటే ఊపిరాడకుండా లేదా కుక్కలపాలై శిశువు మరణించేదని పలువురు చర్చించుకోవడం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment