![పుర ప](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/10hdp01a-110030_mr-1739300566-0.jpg.webp?itok=PYjTvD9v)
పుర పాలనపై ‘పచ్చ’ పెత్తనం
హిందూపురం టౌన్: పుర పాలనపై అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల జోక్యం మితిమీరుతోంది. తమకు అనుకూలంగా పనిచేయని ఉద్యోగులు, అధికారులను బదిలీ పేరుతో ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇటీవల హిందూపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, డీఈ బాలసుబ్రమణ్యం మధ్య సఖ్యత చెడింది. తాము చెప్పినట్లు చేయలేనని కినుక వహించిన డీఈని అధికార పార్టీ నాయకులు కమిషనర్‌పై వత్తిడి తెచ్చి డీఈని సరెండర్ చేయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. తననెలా సరెండర్ చేస్తారంటూ డీఈ కోర్టును ఆశ్రయించడంతో సరెండర్ ఉత్తర్వులను రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆయన తిరిగి విధులకు హాజరయ్యారు. అయితే తొలిరోజే లీవ్ పెట్టి వెళ్లిపోయారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకే సెలవుపై వెళ్లిపోయారనే విమర్శలు ఉన్నాయి.
సహకరించకపోతే పక్కకు తప్పుకోవాల్సిందే..
అధికార పార్టీ నాయకుల మాట వినని అధికారులెవరైనా మున్సిపాలిటీలో తప్పుకోవాల్సిందేనన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో టీపీఎస్ రెహమాన్ పెనుకొండకు బదిలీ అయ్యారు. ఇక్కడి ఏసీపీగా ఉన్న సునీల్‌రాజ్ పోస్ట్‌లేని మడకశిర మున్సిపాలిటీకి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఇక ఎంఈ విశ్వనాథ్ పని ఒత్తిడి తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవు పెట్టేశారు. ఇదిలా ఉండగా ‘పురం’ మున్సిపాల్టీకి బదిలీపై వచ్చిన మహిళా ఆర్‌ఓకు పదిరోజులైనా బాధ్యతలు అప్పగించ లేదు. అలాగే మరో ఇద్దరు ఆర్‌ఐలకు కూడా సరైన స్థానాలు చూపక పోవడంతో సచివాలయ అడ్మిన్లుగా పంపినట్లు విమర్శలున్నాయి.
చెత్త తొలగింపు సంగతేంటి?
మోతుకుపల్లి రోడ్డులోని డంపింగ్ యార్డులో చెత్త తొలగింపు కాంట్రాక్టును గుంటూరుకు చెందిన జాహ్నేశ్వర ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2022లో ఈ–టెండర్ ద్వారా దక్కించుకుంది. చెత్త తొలగింపునకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా రూ.4.91 కోట్లకు అగ్రిమెంట్ చేసుకుంది. ఆ ప్రకారం 61,499 మెట్రిక్ టన్నుల చెత్త మేటలు పూర్తిగా వేరుచేసి తొలగించడంతో పాటు మూడునెలల్లో ఆ ప్రాంతమంతా చదును చేసి ఖాళీ స్థలాన్ని మున్సిపాల్టీకి అప్పగించాల్సి ఉంది. కాంట్రాక్ట్ కంపెనీ గత ఏడాది సెప్టెంబర్‌లో కొంత మేర చెత్త తొలగింపు పనులు చేపట్టింది. ఈ పనులకు సంబంధించి సగం బిల్లు ఇప్పించాలని అధికార పార్టీ నాయకుల ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే పనులు పూర్తి కాకుండా బిల్లులు చేయలేమంటూ అధికారులు స్పష్టం చేశారు. సంబంధిత ఇంజినీర్ కూడా అలాచేస్తే తాను ఇబ్బంది పడాల్సి వస్తుందని అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలోనే నాయకులతో బెడిసి ఇంజినీర బదిలీకి దారి తీసినట్లు సమాచారం.
ఊ..కొడితే ఓకే. .లేదంటే బదీలీనే!
ఇదీ హిందూపురం మున్సిపాలిటీలో ఉద్యోగుల దుస్థితి
![పుర పాలనపై ‘పచ్చ’ పెత్తనం1](https://www.sakshi.com/gallery_images/2025/02/12/10hdp01b-110030_mr-1739300566-1.jpg)
పుర పాలనపై ‘పచ్చ’ పెత్తనం
Comments
Please login to add a commentAdd a comment