![పిల్ల](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11pty101-110025_mr-1739300566-0.jpg.webp?itok=BBBh21Qb)
పిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ప్రశాంతి నిలయం: పిల్లల సంరక్షణను ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా మహిళాభివృద్ధి, సంక్షేమ సాధికారిత సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాలల సంక్షేమ, రక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 12 శాఖలతో ఏర్పాటు చేసిన బాలల సంరక్షణ కమిటీ పిల్లల సంరక్షణ కోసం సంబంధిత శాఖలు బాధ్యతగా పని చేయాలన్నారు. గ్రామ, మండల స్థాయిలలో కూడా పిల్లల సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. బడి వయసు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలల హక్కులు, బాల్య వివాహాలపై అన్ని స్థాయిల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అనాథలు, యాచకులు, వీధి బాలల డేటాను మండలాల వారీగా సమర్పించాలన్నారు. డ్రాపౌట్ పిల్లల డేలా సేకరించాలన్నారు. ఎస్పీ వి.రత్న మాట్లాడుతూ జిల్లాలో పోక్సో కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను గుర్తించాలని, బాల్య వివాహాల నిర్మూలనకు పోలీసు, రెవెన్యూ, ఐసీడీఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ వరలక్ష్మి, డీఈఓ కృష్ణప్ప, సోషల్ వెల్ఫేర్ డీడీ శివరంగ ప్రసాద్, డీఎంహెచ్‌ఓ ఫైరోజ్ బేగం, సీపీఓ విజయ్‌కుమార్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
లోపాలు సరిదిద్దుకోండి
● మాతా శిశు మరణాల నియంత్రణపై డీఎంహెచ్‌ఓ
పుట్టపర్తి అర్బన్: తల్లీ బిడ్డలను కాపాడే క్రమంలో ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలని డీఎంహెచ్‌ఓ ఫైరోజ్‌బేగం సూచించారు. మాతా శిశు మరణాలకు సంబంధించి జిల్లా స్థాయి సబ్ కమిటీ సమావేశం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జనవరి నెలలో పుట్టపర్తి పీహెచ్‌సీ పరిధిలో ఒక మాతృమరణం, రొద్దం, హిందూపురం, పెద్ద మంతూరు, ధర్మవరంలో ఒకొక్కటి చొప్పున నాలుగు శిశు మరణాలు జరిగాయన్నారు. ఇక నుంచైనా ప్రతి బిడ్డనూ, తల్లినీ కాపాడుకోవాలని సూచించారు. గర్భిణులకు ప్రతి నెలా 9న జరిగే శిక్షణలో అవగాహన పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సునీల్, గైనకాలజిస్ట్ డాక్టర్ అస్తరున్నీసా బేగం, పీడీయాట్రీషియన్ డాక్టర్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ప్రశాంతి నిలయం: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్‌ఓ విజయ సారథి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు 23,730 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. 449 కేంద్రాలను ఏర్పాటు చేసి, చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్లు, సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు చెప్పారు. పరీక్షలు జరిగే ప్రాంతాల్లో జిరాక్స్ కేంద్రాలు ముసివేయాలని పోలీసు అధికారులు, లేబర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. మార్చి 17 నుంచి 31 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేయాలన్నారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓపెన్ పరీక్షలకు 780 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. కార్యక్రమంలో డీఈఓ కృష్టప్ప, డీఎస్పీలు విజయ్‌కుమార్, శ్రీనివాసులు, ఎస్పీడీసీఎల్ ప్రతినిధి రమణారెడ్డి, లేబర్ అధికారి సూర్యనారాయణ, పోస్టల్ అధికారి విజయసాయి కుమార్, ఆర్టీసీ డీఎం రవిచంద్ర, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ్‌బేగం పాల్గొన్నారు.
![పిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత 1](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11pty301-110024_mr-1739300566-1.jpg)
పిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
![పిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత 2](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11pty302-110024_mr-1739300566-2.jpg)
పిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
Comments
Please login to add a commentAdd a comment