ఇసుక లారీలు అడ్డగింత
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
జిల్లాలో 2014–19 పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం నదులనే కాదు వాగులు, వంకలను వదల్లేదు. ఇసుక దోపిడీకి తెగబడి ఉన్న ఫలంగా రూ.కోట్లకు పడగెత్తారు. నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదులు అప్పట్లో ఎంత బక్కచిక్కిపోయో అందరికీ తెలుసు. మళ్లీ ఇప్పు డు అదే జరుగుతోంది. అధికారంలోకి రావడమే తరువాయి ఇసుకపై పడ్డారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో సంపాదన లక్ష్యాన్ని అధిగమించేశారు. ఎక్కడికక్కడ అనధికారికంగా ఇసుక తవ్వేసి నదులను మింగేశారు. అధికారికంగా అనుమతులిచ్చిన చోట కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు. నదులను ఏకంగా గుల్ల చేసేస్తున్నారు.
విధ్వంసం ఇలా...
● జిల్లా శాండ్ కమిటీ పర్యావరణ అనుమతులున్న రీచ్‌ల నుంచే ఇసుకను తవ్వాల్సి ఉన్నా అనుమతులతో సంబంధం లేకుండా, పర్యావరణ చట్టాలకు, నిబంధనలకు తూట్లు పొడుస్తూ నదుల్లో కాసుల వేట సాగిస్తున్నారు.
● వంతెనలకు, ఇరిగేషన్ పంపులు, వాటర్ ఫిల్టర్ సంపులకు 500మీటర్లు దూరంలో ఇసుక తవ్వకాలను చేపట్టాలి.
● కానీ నిబంధనలు ఎక్కడా పట్టించుకోలేదు. వంతెనలు, నీటి బావుల దగ్గరల్లో తవ్వేస్తున్నారు.
● ఎట్టి పరిస్థితుల్లోనూ నది లోపలకు మిషనరీ వాహనాలు వెళ్లకూడదు.
● కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా విధ్వంసమే జరుగుతోంది.
● అనుమతులిచ్చిన చోటే కాకుండా పక్కనున్న ఏరియాలో ఇసుక తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు.
● సాయంత్రం 6గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నదుల్లో ఇసుక తవ్వకాలు జరపకూడదని నిబంధనలు ఉన్నా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ర్యాంపుల్లో జేసీబీలు, పొక్లెయినర్లతో తవ్వకాలు జరిపేస్తున్నారు.
● లారీలను నేరుగా నదిలోకి తీసుకెళ్లి ఇసుకను నింపేస్తున్నారు.
● నదుల్లోకి రోడ్డు లేసి మరీ తవ్వుకుపోతున్నారు.
కానరాని నిఘా..
అనుమతులిచ్చిన ఇసుక ర్యాంపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. వాటి ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయాలి. నిర్దేశిత వేళల్లో తవ్వకాలు జరుపుతున్నారో లేదో చూడాలి. ఏయే వాహనాలు వస్తున్నాయో వాటిని రికార్డు చేయాలి. ఎంత ఇసుకను తవ్వుతున్నారో ఎంత ఇసుకను తరలిస్తున్నారో నమోదు చేయాలి. ప్రభుత్వం నిర్దేశించిన చలానా మేరకు ఇసుక లోడింగ్ చేస్తున్నారో లేదో చూసుకో వాలి. అనధికార వసూళ్లకు చెక్ పెట్టాలి, కానీ ప్రస్తుతం ఏ ఇసుక ర్యాంపు వద్ద ఇలాంటి నిఘా లేదు. ఒక్కో లారీకి రూ.10వేల నుంచి రూ.20వేలు వసూలు చేస్తున్నారని సాక్షాత్తు లారీ యజమానుల అసోసియేషన్ ప్రతినిధులు నేరుగా కలెక్టర్ గ్రీవెన్‌సెల్‌కు వచ్చి ఫిర్యాదు చేశారంటే ర్యాంపుల్లో ఎంత బరితెగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇసుక తవ్వకాలతో నదుల విధ్వంసం
వాల్టాకు తూట్లు
వంతెనలు, నీటి బావుల వద్ద తవ్వకాలు
అనుమతులకు మించి తవ్వుతున్న పరిస్థితులు
దోపిడీకి గురవుతున్న రూ.వందల కోట్ల విలువైన ఇసుక
గార: గార శివారు ప్రాంతంలోని ర్యాంపు నుంచి ఇసుక రాత్రి వేళల్లో ఇష్టానుసారంగా తరలించుకుపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఇసుకతో వెళ్తున్న లారీలను అడ్డగించి నిలిపేశారు. 20 టన్నులు నుంచి 35 టన్నుల బరువుండే లారీలు వెళ్తుండటంతో రోడ్డుపక్కనున్న ఇళ్లల్లో ఉన్నవారందరూ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలువురు రోడ్డుపైకి వచ్చి వాహనాలను అడ్డుకున్నారు. వాస్తవానికి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇసుకను తరలించకూడదని నిబంధనలున్నా పట్టించుకోవడం లేదు. స్థానిక ఎస్‌ఐ ఆర్.జనార్ధన సర్దిచెప్పడానికి వెళ్లి.. అనుమతులు ఉన్నాయని చెప్పగా..స్థానికులు చూపించాలని కోరారు. కానీ ఆయన చూపలేకపోవడంతో వాగ్వాదం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment