రైతులు రెండో పంట వేయవద్దు
● వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి: జిల్లాలోని రైతులు వరి రెండో పంట వేయవద్దని వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుకోరారు. ఈ మేరకు విజయ వాడ మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వంశధార గొట్టా బ్యారేజీలో ప్రస్తుతం 500 క్యూసెక్కుల నీరు మాత్రమే నిల్వ ఉందని, నీటి లభ్యత తక్కువగా ఉన్నందున, శివారు ప్రాంతాల రైతులకు సాగునీరు అందే పరిస్థితి లేదని, అందువల్ల వంశధార కాలువల పరివాహక ప్రాంతాల్లోని రైతులు ఈ సమస్యను అర్థం చేసుకొని రెండో వరి పంట వేయవద్దని ఆ ప్రకటనలో మంత్రి అచ్చెన్నాయుడు కోరారు.
పోరాటాలు ఉద్ధృతం చేద్దాం
పలాస: శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల త్యాగాల స్ఫూర్తిని మదినిండా నింపుకొని నేడు ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు తమ పోరాటాలను ఉద్ధృతం చేయాలని వివిధ ప్రజాసంఘాల నాయకులు ప్రతినబూనారు. మర్రిపాడు గ్రామం వద్ద గల జిల్లా అమరవీరుల స్మారక స్థూపం వద్ద సంస్మరణ సభను శుక్రవారం నిర్వహించారు. బొడ్డపాడు గ్రామానికి చెందిన తామాడ గణపతి అమరత్వం పొందిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి 1969 లో జరిగిన పోరాటంలో అసువులు బాసిన వీరులను తలుచుకొని వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు హేమక్క, జె.అప్పయ్య, పోతనపల్లి మల్లేశ్వరరావు, గర్తం కామేశ్వరరావు, కొల్లి మల్లేశ్, దుబ్బ బారికయ్య, వంకల అప్పయ్య, వంకల కామరాజు, కుత్తుం వినోద్ పాల్గొన్నారు.
అసాధ్యం.. సు‘సేద్యం’
ఓ వైపు పెరుగుతున్న పెట్టుబడి.. మరోవైపు తగ్గుతున్న వానలు.. ఇంకోవైపు సవాల్ విసిరే సాగు పరిస్థితులు. ఇన్ని అవాంతరాల మధ్య కూడా ఆ రైతు విజయం సాధించి చూపించాడు. కొత్త విత్తన రకాన్ని ఎంచుకుని వెద పద్ధతిలో సాగు చేశాడు. కవిటి మండలం కపాసుకుద్ధికి చెందిన సర్పంచ్ కాయ దమయంతి భర్త భీమసేన్ ఆర్‌జీఎల్ 2537 రకం విత్తనాలతో చక్కటి దిగుబడి రాబ ట్టారు. ఆయన ఈ రకం వరి విత్తనాలు మూడు బ్యాగులు కొనుగోలు చేసి తన ఐదు ఎకరాల పొలంలో వేయడానికి సిద్ధమయ్యా రు. వానలు అనుకూలించకపోవడంతో మూడెకరాల్లో వేశారు. ప్రస్తుతం ఈ మూడు ఎకరాల్లో వరిచేనులో ఒక్కో దుబ్బుకు 40 నుంచి 45పిలకలు తొడిగి మంచి వెన్ను వేసింది. మంచి ఆశాజనకమైన దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చేనును చూసేందుకు పరిసర గ్రామాలకు చెందిన రైతులు భారీగా తరలివస్తున్నారు. రైతులు కాస్త వినూత్నంగా ఆలోచిస్తే తక్కువ పెట్టుబడితో లాభాల బాట పట్టవచ్చని ఆయన చెబుతున్నారు. – కవిటి
Comments
Please login to add a commentAdd a comment