రూ.6 కోట్లు వరకు పెరిగిన డిమాండ్
ఈ సర్దుబాటు చార్జీల పెంపు అంశంపై జిల్లా వ్యాప్తంగా అటు వినియోగదారులు, ఇటు ప్రజాపక్షాన ఉన్న ప్రతిపక్షాలు సైతం ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా పత్రికా సమావేశాల ద్వారా నిరసనలు తెలియజేస్తుంటే కాంగ్రెస్‌తో పాటు సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు విద్యుత్ కార్యాలయాల వద్ద ఒక రోజు ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు. అయితే ఈ విద్యుత్ చార్జీల పెంపు అంశంపై అధికార పార్టీకి ఎలాంటి మచ్చ అంటకుండా ఉండేలా కూటమి నేతలు అప్రమత్తమై ఆ మచ్చను గత ప్రభుత్వంపై నెట్టేసేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇదే ఉద్దేశాన్ని విద్యుత్ శాఖ అధికారులతో కూడా చెప్పించేలా తద్వారా ప్రజల్లో అధికార పార్టీపై ఎలాంటి వ్యతిరేకత లేకుండా చర్యలకు దిగుతున్నట్లుగా సమాచారం.
● విద్యుత్ వినియోగదారులపై రెండు సార్లు సర్దుబాటు చార్జీల భారం
● యూనిట్ విద్యుత్‌పై గరిష్టంగా రూ.2.50 అదనం
● జిల్లాలో 7.88 లక్షల మంది వినియోగదారులపై ప్రభావం
● ఆందోళనలో వినియోగదారులు
అరసవల్లి:
చంద్రబాబు తన మార్కును మరోమారు చూపించారు. ఎన్నికల ముందు ఎట్టి పరిస్థితుల్లో నూ కరెంటు బిల్లులు పెంచబోమని హామీ ఇచ్చిన బాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రెండు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట గత నెలలోనే వినియోగదారులపై భారాన్ని మోపిన సర్కార్ ఇప్పుడు ఈ నెల నుంచే మరో బాదుడికి సిద్ధమైంది. 2026 వరకు ఈ బాదుడును వినియోగదారులు భరించేలా తీర్మానించి కొత్త చార్జీలను అమలు చేసేశారు. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నుంచి ఆమోదం లభించడంతో జనం నెత్తిన కొత్త భారం పడనుంది.
వరుసగా రెండోసారి చార్జీల మోత
ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట ఇటీవలే డిస్కంల ప్రతిపాదనలను నియంత్రణ మండలి ఆమోదించడంతో దాదాపుగా ఎల్‌టీ వినియోగదారుని విద్యుత్ వినియోగ యూనిట్‌కు గరిష్టంగా రూ.2.50 వరకు పెరిగింది. రెండు నెలల క్రితం యూనిట్ వినియోగ చార్జీలు రూ.1.55 వరకు పెంచేసిన సర్కార్ ఇప్పు డు రెండోసారి మరో రూ.0.92 వరకు పెంచేస్తూ నిర్ణయించింది. దీంతో వరుసగా రెండు సార్లు చార్జీ ల పెంపు అమలు చేయడంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మొదటి పెంపుతో నవంబర్ నుంచి 2026 జనవరి వరకు, అలాగే రెండో దఫా పెంపుతో ఈనెల నుంచి 2026 నవంబర్ వరకు అదనపు చార్జీల భారం పడనుంది.
ప్రభుత్వం చేతులెత్తేయడంతోనే..
వాస్తవానికి ఇంధన విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు చార్జీలను ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే బాధ్యత వహించి ఆ నష్టాలను భరిస్తూ ఉంటాయి. అలాంటిది రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితులు కనిపించలేదు. విద్యుత్ కొనుగోలు భారాలను ప్రజలపై రుద్దాలని నిర్ణయించుకుని గద్దెనెక్కిన ఆరు నెలల్లోనే రెండు సార్లు చార్జీల పెంపుతో బాదేసింది. నిజానికి ప్రభుత్వాలే ఈ భారాన్ని భరిస్తే విద్యుత్ చార్జీల పెంపు అనేది జరిగే అవకాశం ఉండేది కాదు. అయితే ఈ సర్దుబాటు భారా న్ని తాము మోయలేమంటూ కూటమి సర్కార్ చేతులెత్తేయడంతో విద్యుత్ చార్జీల పెంపు షాక్ రాష్ట్ర ప్రజలకు తప్పడం లేదు. దీంతో విద్యుత్ వినియోగదారుల్లో ఒకింత ఆందోళన నెలకొంది.
ఆందోళనకు సిద్ధం
జిల్లాలో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం, పలాస, టెక్కలి డివిజన్ల పరిధిలో మొత్తం 7,88,078 విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటిలో 477 హెచ్‌టి కనెక్షన్లుంటే మిగిలినవన్నీ ఎల్‌టి వినియోగదారులవే. ఇంతవరకు ఈ విద్యుత్ కనెక్షన్ల నుంచి విద్యుత్ వినియోగం దృష్ట్యా అన్ని రకాల చార్జీలతో కలిపి అక్టోబర్ నెలాఖరు నాటికి రూ. 97.55 కోట్లు కాగా, నవంబర్ నెలాఖరుకు (మొదటి సర్దుబాటు చార్జీతో కలిపి) డిమాండ్ ఏకంగా రూ.100.45 కోట్లు వరకు పెరిగింది. ఇక రెండోసారి సర్దుబాటు చార్జీలతో కలిపితే ఈ డిమాండ్ మరో రూ.3 కోట్ల వరకు పెరిగే అవకాశాలున్నాయని విద్యుత్ శాఖ ఈఆర్వో విభాగాధికారులే చెబుతున్నారు. విద్యుత్ వినియోగం పెరిగే క్రమంలో ఈ యూనిట్ చార్జీల పెంపు కూడా తోడైతే కచ్చితంగా వినియోదారునిపై భారం తప్పదనే అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలతో ఎల్‌టీ (డొమస్టిక్) వినియోగదారునికి యూనిట్‌కు ప్రస్తుతానికి రూ.1.90 వసూలు చేస్తుండగా, వచ్చే నెలలో చెల్లించాల్సిన ఈ నెల వినియోగ బిల్లు రూ.4.40 వరకు వరకు వసూలు చేసే అవకాశాలున్నాయి. అదే అధికంగా విద్యుత్‌ను వినియోగించే వినియోగదారునికైతే యూనిట్ విద్యుత్ చార్జీ ఏకంగా గరిష్టంగా రూ.14 వరకు చేరనుందని లెక్కలు చెబుతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగ డిమాండ్ ప్రకారం నెలకు అదనంగా జిల్లా వ్యాప్తంగా గరిష్టంగా రూ.6 కోట్ల వరకు పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment