టీడీపీ నేతల కుట్రలకు హైకోర్టు బ్రేక్
టెక్కలి: సంతబొమ్మాళి మండలం మేఘవరం గ్రామంలో హుదూద్ ఇళ్లల్లో నివసిస్తున్న లబ్ధిదారుల పట్టాలను రద్దు చేసి వాటిని అమ్ముకోవాలని ప్రయత్నాలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ నాయకుల కుట్రలకు హైకోర్టు బ్రేక్ ఇచ్చిందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయా లబ్ధిదారులంతా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దువ్వాడ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎంతో పారదర్శకంగా లబ్ధిదారులకు హుదూద్ ఇళ్లు కేటాయించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లబ్ధిదారులను బయటకు గెంటేసి ఆయా ఇళ్లను అమ్ముకోవాలని ప్రయత్నాలు చేశారని చెప్పారు. ఈ సమస్యను పంచాయతీకి చెందిన నాయకుడు పరపటి శ్రీనివాస్‌రెడ్డి తన దృష్టికి తీసుకురావడంతో ఇటీవల కలెక్టర్‌ను కలిసినట్లు వెల్లడించారు. అనంతరం హైకోర్టును ఆశ్రయిస్తే లబ్ధిదారులకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చిందని ఎమ్మెల్సీ తెలిపారు. ఇకపై లబ్దిదారులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు పరపటి శ్రీనివాస్‌రెడ్డి, మేరుగు అప్పారావు, నారాయణరావు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment