బోరుబద్ర పీహెచ్‌సీ వైద్యురాలికి షోకాజ్ నోటీసు
అరసవల్లి: సంతబొమ్మాళి మండలం బోరుబద్ర పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ దేవీ వనితకు షోకాజ్ నోటీస్ జారీ చేయాల్సిందిగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.మీనాక్షికి రాష్ట్ర వైద్య శాఖ డైరెక్టర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. శనివా రం బోరుబద్ర పీహెచ్‌సీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆకస్మికంగా సందర్శించారు. అయితే పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఇద్దరు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మంత్రి అచ్చెన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం సమయ పాలన పాటించకపోవడంతో మంత్రి అచ్చెన్న ఇచ్చిన సూచన మేరకు ఆలస్యంగా విధుల్లోకి వచ్చిన వైద్యురాలు దేవి వనితకు షోకాజ్ నోటీసు జారీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు డైరెక్టరేట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం సోమవారం డాక్టర్ దేవీవనితకు షోకాజ్ నోటీసును జారీ చేయనున్నారు.
సోమయ్యపేట పరిసరాల్లో పులి సంచారం
సారవకోట: మండలంలోని కుమ్మరిగుంట పంచాయతీ సోమయ్యపేట సమీపంలో పులి పా దముద్రలు గుర్తించినట్లు అటవీ బీట్ అధికారి శివ తెలిపారు. పొలాలకు వెళ్లిన స్థానికుడికి పులి కనిపించడంతో అతను అటవీశాఖకు సమాచారం అందించాడు. సిబ్బంది వెళ్లి పరిశీలించగా పులి పాదముద్రలు కనిపించాయని ఆయన తెలిపారు. పొలాల నుంచి పూల కొండవైపు వెళ్లినట్లు తెలుస్తోందన్నారు. చోడసముద్రం, సొమయ్యపేట, సింగంవలస తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
అలరించిన సుధారాణి
గాత్ర కచేరి
శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లిలోని అనివెట్టి మండపంలో ఆదివారం నిర్వహించిన కృష్ణవేణి సంగీత నీరాజనం అలరించింది. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ నిర్వహణలో ఏర్పాటు చేసిన ఈ గాత్ర కచేరిని ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. ప్రఖ్యాత కళాకారిణి మండ సుధారాణి కర్ణాటక శాసీ్త్రయ గాత్ర కచేరితో ఆకట్టుకున్నారు. ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజు కీర్తనలను చక్కగా ఆలపించారు. వయొలిన్‌పై మావుడూరు సత్యనారాయణ శర్మ, మృదంగంపై ఎం.శ్రీధర్, ఘటంపై మావుడూరు సూర్యప్రసాదరావులు వాద్యసహకారాన్ని అందించారు. కార్యక్రమంలో న్యూఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమీ ప్రతినిధి సంతోష్‌ప్రసాద్ ఈఓ వై.భద్రాజి, టూరిజం అధికారి నారాయణరావు, డీపీఐఆర్‌వో చెన్నకేశవరావు, ఇప్పిలి శంకరశర్మ, పులఖండం శ్రీనివాసరావు తదితరులు పాల్గోన్నారు.
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
రణస్థలం: శ్రీకాకుళం నగరవాసులకు రణస్థలం రామతీర్థాలు కూడలిలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నగరానికి చెందిన అరుణ్‌కుమార్ దంపతులు కారులో విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వస్తున్నారు. రణస్థలం జాతీయ రహదారిపై రామతీర్థాలు కూడలి వైపు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ఒక్కసారి రామతీర్థాలు వైపు నుంచి వచ్చినట్లు తిరిగిపోయింది. లారీ డ్రైవర్ సడన్ బ్రేకు వేయడంతో కారును ఢీకొని ఆగిపోయింది. కారులో ఉన్న అరుణ్‌కుమార్ దంపతులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. శనివారం పోలిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబీకులకు తాము బంధువులమని అరుణ్‌కుమార్ దంపతులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment