మా బంగారం మాకు ఇస్తారా లేదా..?
గార: గార స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియాలో బంగారం తనఖాపెట్టిన ఖాతాదారులు సోమవా రం ఆందోళన చేపట్టారు. దాదాపు మూడు గంటల పాటు ఉద్యోగులు బ్యాంకులోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఉదయం 9 గంటలకే బంగారం తనఖాదారులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. మెయిన్ గేట్ మూసివేసి అడ్డంగా నిలుచున్నారు. బ్యాంకు సిబ్బంది ఒక్కొక్కరు వచ్చినా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎస్‌ఐ ఆర్.జనార్ధన బ్యాంకు వద్దకు వెళ్లి ఖాతాదారులతో మాట్లాడినా బ్యాంకు తెరిచేందుకు ఒప్పుకోలేదు. నవంబర్ 12, 13వ తేదీల్లో ఖాతాదారులకు వడ్డీలు కట్టాలని మెసేజ్‌లు రావడంతో వారంతా ఆందోళన చేపట్టడం, డిసెంబర్ 2వ తేదీకి మీ వస్తువులు ఇస్తామంటూ బ్యాంకు సిబ్బంది హామీ ఇవ్వడంతో అప్పట్లోనే ప్రజాప్రతినిధులు, పోలీసులతో చర్చించి నిరసనలు వాయిదా వేసుకున్నారు. బ్యాంకు సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో శ్రీకాకుళం నుంచి అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ రామరాజు వచ్చి కేసు కోర్టులో డిసెంబర్ 14కు వాయిదా పడిందని, అప్పటివరకు ఆగాలని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఖాతాదారులు తామంతా బ్యాంకును నమ్మి పెట్టామని, కేసుతో తమకు సంబంధం లేదని, ఇప్పటికే మానసికంగా, ఆర్థికంగా అవస్థలు పడుతున్నాం, కాదంటే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. ప్రైవేటు కేసు వేసుకుంటే మీ బంగారం వచ్చే అవకాశముందని సిబ్బంది చెప్పే ప్రయ త్నం చేసినా, మేం తప్పు చేయకుండా కేసులు ఎందుకు వేస్తామని వాదించారు. మాజీ ఎంపీటీసీ జల్లు రాజీవ్, సర్పంచ్ మార్పు పృథ్వీరాజ్‌లు బాధితులు మద్దతుగా మాట్లాడారు. ఏడాది పూర్తవుతున్నా ఇప్పటీకీ తనఖాదారులకు బంగారం ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో సమావేశంలో ఉన్న రీజినల్ మేనేజర్‌తో వీడియోకాల్‌లో మాట్లాడించి, మంగళవారం బ్యాంకు వద్దకు వస్తామని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 12.25 నిమిషాలకు బ్యాంకు తలుపులు తెరుచుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment