ఉద్దానంలో పెద్దపులి సంచారం లేదు
పలాస: పలాస నియోజకవర్గంలోని ఉద్దానం ప్రాంతంలో పెద్ద పులి సంచారం లేదని, ఒక గుర్తు తెలియని జంతువు సంచరిస్తోందని కాశీబుగ్గ అటవీ శాఖ అధికారి మురళీకృష్ణ చెప్పా రు. పలాస మండలం నీలావతి గ్రామంలో జీడితోటలో ఉన్న ఆవుల మందపై దాడి చేసి సోమవారం రాత్రి రెండు లేగదూడలను చంపేసింది. వాటి మాంసం తినేసి అక్కడే వాటిని విడిచి పెట్టి ఆ జంతువు వెళ్లిపోయింది. ఈ సంఘటన స్థలాన్ని ఫారెస్టు రేంజరు మురళీకృష్ణ తన సిబ్బందితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది పెద్ద పులి మాత్రం కాదని చెప్పారు. అలాగే అది ఏ జంతువు అనేది ఇప్పుడే చెప్పలేమని, ప్రజలు మా త్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జంతువు సంచారంతో స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఉద్దానం ప్రాంతంలో అటు ఎలుగుబంట్లు, ఇటు గుర్తు తెలియని జంతువులతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి వారికి తగిన రక్షణ కల్పించాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు.
తీమరలో పులి
పాతపట్నం: మండలంలోని తీమర గ్రామ ప్రాంతంలోని బెండి రామారావుకు చెందిన మామిడితోటలో సోమవారం రాత్రి ఆవుదూడపై పులి దాడి చేసిందని పాతపట్నం ఫారెస్ట్ రేంజర్ అమ్మన్నాయుడు తెలిపారు. మంగళవారం తీమర పంట పొలాల్లో పులి పాద ముద్రలు(పద్మాస్)ను అటవీశాఖ అధికారులు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన బైరి లక్ష్మణరావుకు చెందిన ఆవుదూడను పులి తిన్నట్లు కళేబరాలు ఉన్నాయని అటవీ శాఖాధికారులు తెలిపారు. తీమర, తామర, పెద్దసీది, పాశీగంగుపేట ప్రాంతాల్లో పులి తిరుగుతోందంటూ ప్రచారం జరుగుతుండడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. రొంపివలస నుంచి కొరసవాడ వైపు పులి పాదముద్రలు ఉన్నట్లు గురించామని, ఈ మేరకు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు కోరారు.
7న మెగా పేరెంట్, టీచర్ మీటింగ్
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (మెగా పేరెంట్ టీచర్ డే)ను ఈనెల 7వ తేదీన పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో వారపు సమావేశం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలసి ఆయన జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వీడి యో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పేరెంట్– టీచర్ సమావేశం ద్వారా విద్యార్థులను, తల్లిదండ్రులను పాఠశాలలకు దగ్గర చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో పాఠశాలల అభివృద్ధికి దోహదపడే దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు అయ్యేలా చూడాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో డిసెంబర్ నాటికి మంచినీరు, మరుగుదొడ్లు లేని కేంద్రాలు ఒక్కటి కూడా ఉండరాదని స్పష్టం చేశారు. జిల్లాలో మలేరియా, డెంగీ లాంటి కేసులు నమోదు కారాదని స్పష్టమైన విధి విధానాల ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ పనిచేయాలన్నారు.
సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా
సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయని త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని కలెక్టర్ చెప్పారు. రెవెన్యూ సదస్సులకు సంబంధించిన షెడ్యూల్‌ను రూపొందించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి సేకరణ విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కోరాడ త్రినాథ స్వామి, ఐసిడిఎస్ పీడీ బి.శాంతి శ్రీ, సీపీఓ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment