ఖాదీ ఉద్యోగి శంకరరావుకు బెనారస్ విశ్వవిద్యాలయం ఆహ్వానం
పొందూరు: కాశీలోని హిందూ బెనారస్ విశ్వవిద్యాలయం భారత్ కళాభవన్‌లో ఈ నెల 7న జరిగే ఆర్టిస్టిక్ ఇంటర్నేషనల్ ఖాదీ పుస్తక ఆవిష్కరణ మహోత్సవానికి స్థానిక ఖాదీ సంస్థ ఉద్యోగి జల్లేపల్లి శంకరరావుకు ఆహ్వానం లభించింది. డ్రీమింగ్ ఇట్ ఫార్వర్డ్ అనే పేరుతో ఈ పుస్తకం ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది. దీన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాఽథ్ ఆవిష్కరించనున్నారు. తానాబానా ట్రస్టు(కాశీ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పుస్తకంలో పొందూరు సన్నఖాదీకి సంబంధించిన వివిధ అంశాలు చేర్చడం విశేషం. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఆహ్వానితుడైన శంకరరావు హిందీ–తెలుగు అనువాదకునిగా గుర్తింపు పొందారు. 2007లో నాటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ హైదరాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి భవన్‌లో బస చేసినప్పుడు ఆమెకు పొందూరు ఖాదీ ప్రత్యేకతను శంకరరావే వివరించారు. తర్వాత ఆమె పొందూరు నుంచి ఓ చీరను కూడా తెప్పించుకున్నారు. హిందీ–తెలుగు అనువాదకునిగా గుర్తింపు పొందిన శంకరరావు స్థానిక ఖాదీ సంస్థకు మొత్తం మూడు సార్లు వచ్చిన గాంధీ మనుమరాలు తారాభట్టాచార్జికి అనువాదకునిగా కూడా వ్యవహరించారు. ఆయన మహారాష్ట్ర వార్ధా జిల్లా సేవాగ్రామ్‌లో జన్మించారు. తండ్రి సత్యనారాయణ అప్పట్లో అక్కడ కేవీఐసీ ఉద్యోగిగా పనిచేశారు. శంకరరావును ఈ సందర్భంగా ఖాదీ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు జికే ప్రసాద్, డీవీ రమణ, సిబ్బంది, కార్మికులు, ‘పొందూరు మరో పోర్‌బందర్’ పుస్తక రచయిత వాండ్రంగి కొండలరావులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment