● తోలాపిలో
పొందూరు: ప్రపంచ దివ్యాంగ దినోత్స వం రోజునే అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తన నీచ ప్రవర్తనను బయటపెట్టాడు. దివ్యాంగ ఉద్యోగి అని చూడ కుండా సచివాలయంలో ఉన్న వీఆర్వోపై దాడికి పాల్పడ్డాడు. అధికార పార్టీ నాయకుడిననే అహంకారం, టీడీపీ ఎంపీటీసీ భర్తననే అహంభావంతో తోలాపి సచివాలయంలో మంగళవారం వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే...
తోలాపి ఎంపీటీసీ భర్త పప్పల రామినాయుడు సుమారు 3 గంటల సమయంలో తోలాపి సచివాలయానికి వచ్చాడు. ఆ సమయంలో ఉన్న సచివాలయం కార్యదర్శి కూన వినోద్‌తో గ్యాస్ సబ్సిడీ వైఎస్సార్ సీపీ అనుచరులకు పడిందనే విషయంపై వాగ్వాదం జరిగింది. అయితే గ్యాస్ సబ్సిడీ అంశం తమది కాదని నచ్చజెప్పి కార్యదర్శి వినోద్ బయటకు వెళ్లాడు. అప్పటికి కార్యాలయంలో ఉన్న రామినాయుడు మద్యం మత్తులో అక్కడి కంప్యూటర్లను నేలకేసి కొట్టి ధ్వంసం చేశాడు. శబ్దం విని వచ్చిన వీఆర్‌ఓ ఎం.దివాకర్(రేవతిరావు)పై విచక్షణ రహితంగా దాడికి దిగాడు. మెడ పట్టుకుని గట్టిగా నొక్కడంతో వీఆర్‌ఓ గిలగిలలాడాడు. అక్కడే ఉన్న ఉపసర్పంచ్ పప్పల శ్రీనివాసరావు వీఆర్వోను రామినాయుడు నుంచి విడదీశాడు. దీంతో వీఆర్వోకు పెద్ద ప్రమాదమే తప్పింది.
వీఆర్వోకు మండలంలో వివాద రహితుడు, సౌమ్యుడనే పేరుంది. దివ్యాంగుడైన రేవతిరావుకు తోలాపి గ్రామంలోనూ మంచి పేరు ఉంది. అలాంటి ఉద్యో గిపై దాడికి పాల్పడటంతో అధికార పార్టీ నాయకుల్లోనే కాకుండా గ్రామస్తులలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీఆర్వోపై దాడి జరిగిన విషయంపై విధి నిర్వహణలో ఉన్న తోటి ఉద్యోగులు కార్యదర్శికి సమాచారం అందించారు. వెంటనే కార్యాలయానికి వచ్చిన కార్యదర్శికి పరిస్థితి అర్థం కావడంతో వెంటనే విషయాన్ని ఎంపీడీఓ మన్మధరావు, ఈఓఆర్డీ సింహాచలంకు సమాచారం ఇచ్చారు. ఇదే సమయంలో వీఆర్వో రేవతిరావు తహసీల్దార్ వెంకటేష్ రామానుజంకు విషయాన్ని తెలిపారు. తక్షణమే కార్యాలయం నుంచి వచ్చేయాలని తహసీల్దార్ వీఆర్వోకు సూచించారు.
ప్రపంచ దివ్యాంగ దినోత్సవం రోజే దివ్యాంగ ఉద్యోగిపై దాడి
తోలాపి సచివాలయంలో టీడీపీ ఎంపీటీసీ భర్త వీరంగం
Comments
Please login to add a commentAdd a comment