ల్యాబ్‌ టెక్నీషియన్‌ మురళి సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ల్యాబ్‌ టెక్నీషియన్‌ మురళి సస్పెన్షన్‌

Published Tue, Dec 3 2024 12:35 AM | Last Updated on Tue, Dec 3 2024 12:35 AM

ల్యాబ

ల్యాబ్‌ టెక్నీషియన్‌ మురళి సస్పెన్షన్‌

అరసవల్లి: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖాధికారులకు చిక్కిన ల్యాబ్‌ టెక్నీషియన్‌ గొండు మురళిని విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లుగా జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి (డీసీహెచ్‌సీ) డాక్టర్‌ కల్యాణ్‌బాబు ప్రకటించారు. బుడితి సీహెచ్‌సీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్న మురళిని ఏసీబీ పోలీసులు అరెస్ట్‌ చేయడంతో నిబంధనల ప్రకారం ఆయన్ను విధుల నుంచి సస్పెండ్‌ చేశామని వివరించారు.

అసంబద్ధంగా టెన్త్‌ పరీక్షల కార్యాచరణ

శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధత కోసం పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన వందరోజుల కార్యాచరణ ప్రణాళిక పూర్తిగా అసంబద్ధంగా ఉందని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ శ్రీకాకుళం జిల్లా శాఖ ముఖ్య ప్రతినిధులు పిసిని వసంతరావు, కూన రంగనాయకులు, పట్నాన వెంకట రమణ, పూడి లక్ష్మీపతి, కుప్పన్నగారి శ్రీనివాసరావు, గొడబ మేరీప్రసాద్‌, మీనాకుమారి ఖండించారు. ఈ మేరకు సోమవారం వారు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఒకదాని వెంట మరొకటి విద్యాశాఖ విడుదల చేస్తున్న ఉపాధ్యాయ వేధింపుల ఉత్తర్వులకు ఈ కార్యాచరణ ప్రణాళిక ఒక ఉదాహరణగా ఉందని పేర్కొన్నారు. రెండో శనివారం ఆదివారాల్లో కూడా పాఠశాలలు పనిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం బాధాకరమని తెలిపారు. మూడు నెలలపాటు ఒక్కరోజు కూడా సెలవు లేకుండా పనిచేస్తున్న ఉపాధ్యాయులను, విద్యార్థులను ఇంత చులకనగా చూడటం ఎంతమాత్రం తగదని ఆరోపించారు. సంక్రాంతి సెలవు దినాలలో సైతం కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులను తీసుకొని పండుగ చేసుకోమని విద్యాశాఖ చెబుతుండటం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. ఉత్తర్వులను తక్షణమే నిలుపుదల చేసి విద్యార్థులకు ఉపాధ్యాయులకు శని, ఆదివారాలతోపాటు పండగ సెలవు ల వెసులుబాటు విధిగా కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

శ్రీముఖలింగంలో శివస్వాములు

జలుమూరు: కార్తీక మాసం ముగింపు పోలి పాఢ్యమిని పురస్కరించుకుని శ్రీముఖలింగం దేవాలయానికి శివస్వాములు సోమవారం అధిక సంఖ్యలో వచ్చారు. వంశధార నదిలో పుణ్యస్నానాలు చేసి శివయ్యకు ఇరుముడి సమర్పించి దీక్ష విరమించారు. జిల్లా నలుమూలలతోపాటు అధికంగా పాలకొండ, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు.

వర్మీ కంపోస్టు విక్రయం ప్రోత్సహించాలి

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): వర్మీ కంపోస్టు విక్రయాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ వెల్లడించారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరం బయట ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్టు స్టాల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్మీ కంపోస్టు పంచాయతీల నుంచి స్వయం సహాయక సంఘాలకు సరఫరా చేస్తే వారు విక్రయిస్తారని చెప్పారు. దూసి పంచాయతీ నుంచి వర్మీ కంపోస్టు స్టాల్‌ను ఏర్పా టు చేశారు. పంచాయతీలకు క్యూ ఆర్‌ కోడ్‌ ఉండాలని, దాని ద్వారా వర్మీ కంపోస్టు పేమెంట్‌ తీసుకోవాలని డీపీఓను ఆదేశించారు. వర్మీ కంపోస్టు అందరూ కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలన్నారు. మున్సిపాలిటీల నుంచి వర్మీ కంపోస్టు స్టాల్‌ ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ఆర్గానిక్‌ పంటలు పండించే రైతుల ఫోన్‌ నంబర్లు తీసుకొని వారికి ఫోన్‌ చేసి వర్మీ కంపోస్టు విక్రయంపై రైతులకు తెలియజేయాలని ఆదేశించారు. ఆర్గానిక్‌ పంటలు పండించే రైతుల ఫోన్‌ నంబర్లు మార్కెటింగ్‌ శాఖ ఏడీ వద్ద ఉంటా యని చెప్పారు. వర్మీ కంపోస్టు రైతులకు ఉపయోగకరంగా ఉండాలన్నారు. ఉద్యానవన శాఖ, ఉపాధి హామీ నుంచి వర్మీ కంపోస్టు ఉపయోగాలపై రైతులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీపీఓ కె.భారతి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ల్యాబ్‌ టెక్నీషియన్‌  మురళి సస్పెన్షన్‌ 
1
1/1

ల్యాబ్‌ టెక్నీషియన్‌ మురళి సస్పెన్షన్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement