ఉపాధ్యాయులకు జేఎల్ పదోన్నతులు కల్పించాలి
● ఆపస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఎస్.బాలాజీ
టెక్కలి: ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇంటర్మీడియెట్ కళాశాలల్లో బోధించేందుకు జూనియర్ లెక్చరర్లగా పదోన్నతులు కల్పించాలని ఆపస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ డిమాండ్ చేశారు. బుధవారం టెక్కలిలో జిల్లా అధ్యక్షుడు డి.శివరామ్‌ప్రసాద్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 శాతం నాన్‌టీచింగ్ సిబ్బందికి బీఎడ్ అర్హత లేకపోయినా ఎన్సీటీఈ ప్రకారం జేఎల్‌గా పదోన్నతులు ఇస్తుండగా.. బోధన అనుభవం కలిగిన ఉపాధ్యాయులకు జేఎల్‌గా ఎందుకు పదోన్నతులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఉపాధ్యాయు పెన్షనర్లకు బకాయిలు విడుదల చేయాలని, హైస్కూల్ ప్లస్‌లను కొనసాగించి రెగ్యులర్ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా 12వ పీఆర్‌సీపై చర్యలు తీసుకోకపోవడం తగదన్నారు. సంక్రాంతికి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆపస్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో రాష్ట్ర గౌరవ సలహాదారుడు టి.ఆనందరావు, కార్యదర్శి డి.చలపతిరావు, సభ్యులు ఎస్.నరసింగరావు, కె.సోమేశ్వరరావు, సిహెచ్.రమణ, పి.కాశీవిశ్వనాథ్, గిరి, రవి, వాసు, చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టెక్కలిలో చోరీ
టెక్కలి రూరల్: స్థానిక అయ్యప్పనగర్‌లో బుధవారం వేకువజామున నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో చోరీ జరిగినట్లు ఇంటి యజమాని తెలిపారు. అయ్యప్పనగర్‌లో నూతనంగా జోగి హేమసుందర్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. అయితే తన ఇంట్లోని ఒక గదిలో పనికి సంబంధించిన మిషన్లు, మరికొన్ని సామాన్లు భద్రపరిచారు. అయితే బుధవారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తి ఆ ఇంటి తాళాలు విరగొట్టి సామాగ్రి దొంగలించినట్లు ఆ ఇంటికి ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. అనంతరం బాధితుడు టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: ఈనెల 22వ తేదీ రాత్రి కె.కొత్తూరు సమీపంలో లారీ డ్రైవర్ అబ్ధుల్ పాషా(52) అనే వ్యక్తి తన లారీని రోడ్డు పక్కగా ఆపి, రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనం ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలకు గురైన అబ్ధుల్ పాషాను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన గురువారం రాత్రి మృతి చెందాడని, అనంతరం బుధవారం శవ పంచనామ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు అబ్ధుల్ పాషా కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా బసవకల్యాణం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈయన ఉల్లిపాయలు లోడుతో కర్ణాటక నుంచి బ్రహ్మపూర్ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
టెక్కలి రూరల్: స్థానిక ఆదిఆంధ్ర వీధి సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, 4 గొర్రెలు మృతి చెందాయి. ఈ మేరకు స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోటబొమ్మాళి మండలం చుట్టుగుండం గ్రామానికి చెందిన ఎం.దండాసి అనే వ్యక్తి తన గొర్రెలు మేపుకుంటూ ఆదిఆంధ్ర వీధి సమీపంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నం చేశాడు. అదే సమయంలో శ్రీకాకుళం నుంచి పలాస వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో దండాసి కాలు విరగడంతో పాటు 4 గొర్రెలు మృతి చెందినట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment