బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పరస్పరం దాడులు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పరస్పరం దాడులు

Published Fri, Aug 23 2024 3:14 AM | Last Updated on Fri, Aug 23 2024 3:14 AM

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పరస్పరం దాడులు

తిరుమలగిరి (తుంగతుర్తి): తిరుమలగిరి మండల కేంద్రంలో గురువారం టెన్షన్‌ వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు, కోడిగుడ్లు, టమాటలతో దాడులు చేసుకునే పరిస్థితి వచ్చింది. అసలేమైందంటే.. ఎలాంటిషరతులు లేకుండా అర్హులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు ధర్నాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఈనేపథ్యంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ నేతృత్వంలో తిరుమలగిరి ఎక్స్‌రోడ్డులోని మోత్కూరువెళ్లే మార్గంలో టెంట్‌వేసి ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు పోటీగానే కాంగ్రెస్‌ శ్రేణులు కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీని చేసినందుకు హర్షిస్తూ ఎక్స్‌రోడ్డులోని మహాత్మా జోతిబాఫూలే విగ్రహం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆ సమయంలో ధర్నాలో గాదరి కిషోర్‌ మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్సారెస్పీ రెండో దశ కాల్వలకు సాగునీటిని విడుదల చేయాలని కోరారు. అదేసమయంలో శిబిరంలోఉన్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. ఆ సమయంలో కాంగ్రెస్‌ నాయకులు సీఎంకు అనుకూలంగా నినాదాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ శిబిరంపైకి వెళ్లడానికి మూకుమ్మడిగా ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొంతమంది కాంగ్రెస్‌ కార్యకర్తలు బారికేడ్లను తప్పించుకొని బీఆర్‌ఎస్‌ శిబిరంపైకి వెళ్లారు. ఈ దశలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం కోడిగుడ్లు, రాళ్లు, టమాటలు, టపాసులు విసురుకున్నారు. పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. చౌరస్తాలో అరగంటపాటు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఈ దాడుల్లో ఇరు పార్టీలకు చెందిన ఆరుగురికి స్పల్పగాయాలయ్యాయి. రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement