రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

Published Tue, Aug 27 2024 2:42 AM | Last Updated on Tue, Aug 27 2024 2:42 AM

-

దేవరకొండ: బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డుపై నిలిపిన లారీని వెనుక నుంచి ఢీకొట్టి మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి దేవరకొండ మండల పరిధిలోని బొల్లిగుట్టతండా సమీపంలో జరిగింది. సీఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం గిరిజానగర్‌తండాకు చెందిన ఇస్లావత్‌ నరేష్‌(21), సబావత్‌తండాకు చెందిన రాహుల్‌(18) డీజే ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. ఆదివారం డిండి మండలంలో ఓ శుభకార్యానికి డీజే తీసుకెళ్లారు. శుభకార్యం పూర్తయిన తర్వాత వారిద్దరు బైక్‌పై తూర్పుపల్లి మీదుగా స్వగ్రామాలకు వెళ్తుండగా.. దేవరకొండ మండల పరిధిలోని బొల్లిగుట్టతండా సమీపంలోకి రాగానే రోడ్డుపై నిలిపిన లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నరేష్‌, రాహుల్‌కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో వారిని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా నరేష్‌ మార్గమధ్యలో మృతిచెందాడు. రాహుల్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

పాతకక్షలతో ఇద్దరిపై దాడి

ఆత్మకూరు (ఎస్‌): పాతకక్షలను మనసులో పెట్టుకొని ఇద్దరు వ్యక్తులపై మద్యం సీసాలతో మరో ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన ఆత్మకూరు(ఎస్‌) మండలం నెమ్మికల్‌ గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెమ్మికల్‌ గ్రామానికి చెందిన పెద్దింటి సైదులు, వేల్పుల వంశీపై అదే గ్రామానికి చెందిన వీరబోయిన భరత్‌, కొడిదల వంశీ మధ్య ఏడాది క్రితం గొడవ జరిగింది. ఆదివారం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా భరత్‌, కొడిదల వంశీ మద్యం తాగడానికి సాయంత్రం ఆత్మకూర్‌(ఎస్‌) శివారుకు వచ్చారు. అదే సమయంలో సైదులు, వేల్పుల వంశీకి ఫోన్‌చేసి మాట్లాడుకుందాం అని పిలిపించారు. వారిద్దరు అక్కడకు రాగానే భరత్‌, కొడిదల వంశీ మద్యం సీసా పగులగొట్టి సైదులు, వేల్పుల వంశీపై దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నిందితులను అరెస్‌ట చేసినట్లు ఎస్‌ఐ సైదులు తెలిపారు. రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు పంపినట్లు పేర్కొన్నారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

మద్దిరాల: అక్రమంగా తరలిస్తున్న 23క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సోమవారం మద్దిరాల మండల కేంద్రంలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌ మండల కేంద్రానికి చెందిన కాసం వీరభద్రయ్య నకిరేకల్‌ చుట్టపక్కల గ్రామాలు, తండాల్లో 23క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి డీసీఎంలో మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలంలోని నర్సింహులగూడెం గ్రామంలో గల రాజరాజేశ్వరీ రైస్‌ మిల్లు వద్ద మేకపోతుల గోవర్ధన్‌రెడ్డికి అధిక ధరకు అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో మద్దిరాల మండలం కేంద్రంలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు డీసీఎంలో రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. డీసీఎంను, రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు. కాసం వీరభద్రయ్యతో పాటు మేకపోతుల గోవర్ధన్‌రెడ్డి, డీసీఎం డ్రైవర్‌, డీసీఎం యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

కోతుల దాడిలో వృద్ధురాలికి గాయాలు

నాగారం: కోతుల దాడిలో వృద్ధురాలికి గాయాలయ్యాయి. ఈ ఘటన నాగారం మండల కేంద్రంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం మండల కేంద్రానికి చెందిన నూక నర్సమ్మ ఇంట్లోకి సోమవారం కోతుల మంద చొరబడి వండిన ఆహార పదార్థాలు తింటున్నాయి. ఇది గమనించిన నర్సమ్మ కర్రతో కోతుల మందును వెళ్లేగొట్టే ప్రయత్నం చేయగా కోతుల మంద ఒక్కసారిగా ఆమైపె దాడి చేశాయి. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి కోతుల మందును వెళ్లగొట్టారు. నర్సమ్మ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా నెల రోజుల క్రితం నాగారం మండల కేంద్రానికే చెందిన చలమందు, ముత్తమ్మ దంపతులపై కోతులు దాడి చేయగా వారు తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement