పాడి రైతులు మెళకువలు పాటించాలి
జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు
కోదాడరూరల్ : పశుపోషణ లాభసాటిగా ఉండాలంటే పాడిరైతులు మెళుకువలు పాటించాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ బోడెపూడి శ్రీనివాసరావు సూచించారు. గురువారం కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో ఏర్పాటు చేసిన ఉచిత ఫలదీకరణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. పాడి రైతులకు పశుపోషణపై సరైన అవగాహనలేక పాడిలేని గేదెలను మేపుతూ నష్టపోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా 116 పశువులకు గర్భకోశ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.పెంటయ్య, కౌన్సిలర్ పెండెం వెంకటేశ్వర్లు, సూర్యాపేట అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి.వెంకన్న, చిలుకూరు, కోదాడ, కట్టకమ్ముగూడెం పశువైద్యాధికారులు డాక్టర్ వీరారెడ్డి, డాక్టర్ మధు, డాక్టర్ శ్రీనివాస్, ప్రశాంత్, వినయ్ పాల్గొన్నారు.
అభ్యంతరాల స్వీకరణ
సూర్యాపేట : మున్సిపాలిటీలో విలీనమైన తొమ్మిది గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇంటి పన్ను, నీటి బిల్లును పెంచేందుకు కౌన్సిల్ అనుమతి ఇచ్చినందున ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పన్నులు పెంచేందుకు నిర్ణయించామని సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలో విలీనమైన దురాజ్‌పల్లి, దాసాయిగూడెం, రాయినిగూడెం, పిల్లలమర్రి, గాంధీనగర్, బీబీగూడెం, కుడకుడ, కుప్పిరెడ్డిగూడెం, ఖాసీంపేట, కుసుమవారిగూడెంలలో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఇంటి పన్ను, నీటి బిల్లును పెంచేందుకు నిర్ణయించామన్నారు. ఈ విషయంలో అభ్యంతరాలు ఉంటే ఆయా గ్రామాల ప్రజలు శుక్రవారం నుంచి మూడు రోజుల్లో లిఖితపూర్వకంగా మున్సిపల్ కార్యాలయంలో తెలియజేయాలన్నారు.
ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
సూర్యాపేటటౌన్ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వరంగల్–ఖమ్మం–నల్లగొండ నియోజకవర్గానికి 2025 మార్చిలో జరగబోయే ఎన్నికల్లో ఓటు నమోదుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినందున ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని టీపీయూఎస్ పూర్వ అధ్యక్షుడు తీకుళ్ల సాయిరెడ్డి కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఓటరు జాబితా రద్దయిందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు ఓటరు నమోదుకు గడువు ఉన్నప్పటికీ పాఠశాలలకు, కళాశాలలకు దసరా సెలవులు ఉన్నందున సర్వీస్ సర్టిఫికెట్ తీసుకుని, సెలవుల్లోనే ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే వారికి కూడా కొన్ని నియమాలతో ఓటు హక్కు ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ దండా మురళీధర్‌రెడ్డి, నామాల వీరయ్య, తీకుళ్ల శ్రీనివాస్‌రెడ్డి, పి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
డీజేల వినియోగంపై నిషేధం
సూర్యాపేటటౌన్ : జిల్లా పరిధిలో ఈ నెల 14 వరకు డీజేలను నిషేధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని ఇన్‌చార్జ్ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో డీజేల నుంచి వచ్చే అధిక శబ్ధాల కారణంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతున్న కారణంగా డీజేలను నిషేధించినట్లు పేర్కొన్నారు. ఈ నిషేధ ఉత్తర్వులు ఉల్లంఘించి ఎవరైనా డీజేలు వినియోగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నారసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వయంభూ నారసింహుడికి సంప్రదాయ పూజలు వైభవంగా నిర్వహించారు. గురువారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేశారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తుల చెంత అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment