మాకు న్యాయం చేయాలి
ఫ మా జీతాలు లోన్ ఈఎంఐలకే పోతున్నాయి
ఫ ఏడాది కాలంగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు
ఫ సూర్యాపేట ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ చేతిలో మోసపోయిన పలు శాఖల ఉద్యోగుల ఆవేదన
ఫ బ్యాంకు ఎదుట బాధితుల ఆందోళన
సూర్యాపేట : సూర్యాపేట ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ చేసిన మోసానికి తమ జీతాలు లోన్ ఈఎంఐలకే పోతున్నాయని పలు శాఖల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట బాధిత ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ 2022 నుంచి సూర్యాపేట ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ లో మేనేజర్‌గా పనిచేసిన షేక్ సైదులు గతంలో బ్యాంకులో లోను తీసుకున్న పలు శాఖల ఉద్యోగులు 33 మంది పేర ఫోర్జరీ సంతకాలతో తమకు తెలియకుండా తిరిగి లోన్ తీసుకున్నాడని ఆరోపించారు. సదరు బ్రాంచ్ మేనేజర్ పర్సనల్ లోన్, టాప్ అప్ లోన్ పేరుతో ఉద్యోగుల పత్రాలు తీసుకొని అనంతరం తమకు లోను రాదని చెప్పి ఆ లోను తాను తన ఖాతాలో వేసుకున్నట్లు తెలిపారు. ఒక్కో ఉద్యోగి పేర రూ.15లక్షల నుంచి రూ.25 లక్షల వరకు లోన్ తీసుకున్నట్లు బాధితులు చెప్పారు. 2023 జూన్ లో సదరు బ్రాంచ్ మేనేజర్ రామంతాపూర్ ట్రాన్స్‌ఫర్ కాగా అక్కడ కూడా ఇలాగే చేస్తుండడంతో జనవరి 23న పట్టుకున్నారన్నారు. అప్పటి వరకు తమ పేర తీసుకున్న బ్యాంకు రుణాలకు ఈఎంఐ లను సదరు బ్రాంచ్ మేనేజర్ సైదులు చెల్లించాడని తెలిపారు. ఆ తర్వాత ఆ లోన్లకు సంబంధించిన ఈఎంఐ లు తమ జీతాల నుంచి కట్ అవుతుండడంతో అనుమానం వచ్చి బ్యాంకులో సంప్రదించామన్నారు. అప్పుడు విషయం బయటకు రావడంతో బ్యాంకు రీజనల్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్ లను కలిసి విషయం తెలిపినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదన్నారు. ఏడాది కాలంగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నామని , బ్రాంచ్ మేనేజర్ తీసుకున్న లోన్లకు తమ జీతాల నుంచి ఈఎంఐలు కట్ అవుతున్నాయన్నారు. వచ్చిన జీతం మొత్తం ఈఎంఐ లకే పోతుండడంతో కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు బ్రాంచ్ మేనేజర్ ను పోలీసులు ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నారని, ఆయన కూడా తమ లోన్లు తీసుకున్నట్లు అంగీకరించాడని అయినప్పటికీ బ్యాంకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. ఇప్పటికై నా బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి తమ జీతాల నుంచి బ్రాంచ్ మేనేజర్ తీసుకున్న లోన్ల ఈఎంఐ లను మినహాయించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment