సమయ పాలన పాటించాలి
సూర్యాపేటటౌన్ : అధ్యాపకులు, విద్యార్థులు సమయ పాలన పాటించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి భానునాయక్ సూచించారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసి మాట్లాడారు. కళాశాలలో విద్యార్థులకు స్టడీ అవర్ పెంచాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించేలా అధ్యాపకులు పాఠాలు బోధించాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదవాలని, చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పెరుమాళ్ల యాదయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మద్యం సేవించి స్కూల్‌కు వచ్చినఉపాధ్యాయుడి సస్పెన్షన్
మోతె: మద్యం సేవించి పాఠశాలకు హాజరైన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండల పరిధిలో రాంపురంతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నవిల ఉపేందర్ సోమవారం మద్యం సేవించి విధులకు హాజరయ్యారు. స్కూల్ ఆవరణలో స్పృహలేకుండా నిద్రపోయారు. గమనించిన విద్యార్థులు, గ్రామస్తులు.. సదరు ఉపాధ్యాయుడి ఫొటోలు, వీడియో తీసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపించడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఎంఈఓ విచారణ చేసిన అనంతరం ఉపాధ్యాయుడు నవిల ఉపేందర్‌ను డీఈఓ అశోక్ సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలల్లో నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు.
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు
సూర్యాపేట: ఆశా కార్యకర్తలు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోటాచలం సూచించారు. మంగళవారం జిల్లాలోని అంబేద్కర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఆశా కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన వైద్య సేవలు సలహాలు, సూచనలు చేయాలన్నారు.
సీపీఐ శత వార్షికోత్సవాలు నిర్వహించాలి
భానుపురి (సూర్యాపేట): సీపీఐ శత వార్షికోత్సవాలను ఏడాది పాటు ఊరూ– వాడా ఏకమై నిర్వహించాలని ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి కోరారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పార్టీని మరింతబలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్టీ లేని గ్రామాల్లో ప్రజాసంఘాలను నిర్మించడం ద్వారా విస్తృతపర్చవచ్చన్నారు. నవంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 26 వరకు పార్టీ ప్రజా సంఘాల సభ్యత్వం పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. డిసెంబర్ 30న నల్లగొండ జిల్లా కేంద్రంలో శత వార్షికోత్సవాల సందర్భంగా బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, నాయకులు యల్లావుల రాములు, ధూళిపాళ ధనుంజయనాయుడు, మేకల శ్రీనివాస్, నారాయణరెడ్డి, కంబాల శ్రీనివాస్, పోకల వెంకటేశ్వర్లు, బద్దం కృష్ణారెడ్డి, గుండు వెంకటేశ్వర్లు, ఎస్.కె లతీఫ్, దేవరం మల్లీశ్వరి, కోటమ్మ, సాహెబ్ అలీ, రమేష్, చిలక రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment