పదికి ప్రతే్యక తరగతులు
నాగారం: పదో తరగతిలో వంద శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈనెల 1 నుంచే జెడ్పీ ఉన్నత, మోడల్ స్కూల్, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ఎయిడెడ్ స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వచ్చే నెలాఖరు వరకు సాయంత్రం వేళ, 2025 జనవరి 1 నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు పూటలా ప్రత్యేక తరగతులు ఉంటాయి.
తరగతుల నిర్వహణ ఇలా..
జిల్లాలో 2024–25 విద్యాసంవత్సరంలో 6,345 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా టైంటేబుల్ రూపొందించుకోవడం, రోజూ ఒక సబ్జెక్టు ఉపాధ్యాయుడు స్పెషల్ క్లాస్ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు వెనకబడకుండా ముఖ్యమైన అంశాలను చదివిస్తున్నారు. ఈనెల 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు సాయంత్రం 4:20 గంటల నుంచి 5:20 గంటల వరకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలి. జనవరి 1 నుంచి వార్షిక పరీక్షల వరకు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4:20 నుంచి 5:20 గంటల వరకు రెండు పూటలా తరగతులు నిర్వహించాలి. ఇందులో రెగ్యులర్ తరగతులు బోధించకుండా పునశ్చరణ, మూల్యాంకనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్పెషల్ క్లాసులకు విద్యారులు విధిగా హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. ప్రత్యేకంగా రిజిస్టర్ మెయింటేయిన్ చేయాలి. ఎప్పటి కప్పుడు విద్యా ప్రగతిపై విద్యార్థులతో చర్చించాలి. ప్రధానోపాధ్యాయుడు నిరంతరం పర్యవేక్షిస్తూ చదువులో వెనుకబడిన వారిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థులు రాసిన జవాబులను పరిశీలించి చర్చలతో సరిదిద్దాలి. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా మోటివేట్ చేయాలి.
ఐదు రోజులుగా కొనసాగుతున్న
టెన్త్ స్పెషల్ క్లాసులు
డిసెంబర్ వరకు సాయంత్రం వేళ
జనవరి నుంచి
రెండు పూటలా..
వందశాతం ఫలితాల సాధనే లక్ష్యం
గతేడాది ఉత్తీర్ణత ఇలా..
2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో 96 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా 6వ స్థానంలో నిలిచింది. ఈసారి వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యా శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలి
పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత దాదాపుగా తీరింది. పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీత సాధించే లక్ష్యంతో సబ్జెక్టు టీచర్లు ప్రణాళికరూపొందించుకొని ముందుకు సాగాలి. ప్రత్యేక తరగతుల కోసం విధిగా రిజిస్టర్ నిర్వహించాలి. అవసరమైతే అధికారులతో తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలి.
– అశోక్, డీఈఓ, సూర్యాపేట
Comments
Please login to add a commentAdd a comment