రుణమాఫీ కాలే..!
29,608 మంది రైతులకు
కుటుంబ నిర్ధారణకు యాప్
జిల్లాలో మూడు విడతల్లో మొత్తం 95,350 మందికి గాను రూ.746.09 కోట్ల మాఫీ చేసింది. అయితే అన్ని అర్హతలు ఉండి పాస్ పుస్తకం, బ్యాంక్ పుస్తకాలు, ఆధార్ కార్డులో తప్పులు, రేషన్ కార్డు లేకపోవడం తదితర కారణాలతో సుమారు 29,608 మందికి రుణమాఫీ కాలేదని ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ రుణమాఫీ చేసేందుకు గాను కుటుంబ నిర్ధారణ చేయాలని భావించి యాప్‌ను రూపొందించింది.
భానుపురి (సూర్యాపేట) : రైతు రుణమాఫీ పథకం అసంపూర్తిగానే మిగిలింది. మూడు విడతల్లో చేపట్టిన ఈ ప్రక్రియలో అన్ని అర్హతలున్నా వివిధ సమస్యల కారణంగా వేలమందికి మాఫీ డబ్బులు జమ కాలేదు. ఇలాంటి వారందరి కుటుంబ నిర్ధారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించగా.. జిల్లాలో ఈ ప్రక్రియ 80 శాతమే పూర్తయింది. 10 రోజులుగా సంబంధిత యాప్ పనిచేయకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. దీంతో 29,608 మంది రైతులకు ఎదురుచూపులు తప్పడంలేదు.
80శాతమే నమోదు పూర్తి
కుటుంబ నిర్ధారణ కోసం వచ్చిన దరఖాస్తుల్లో వ్యవసాయ అధికారులు 80 శాతం వివరాలను మాత్రమే ఈ యాప్‌లో నమోదు చేశారు. దాదాపు 10 నుంచి 15 రోజులుగా యాప్ పనిచేయకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. ఇక బ్యాంకర్లకు ఆధార్ కార్డులో ఒకలా, పట్టాదారు పాసు పుస్తకాల్లో మరోలా ఉన్నవారి వివరాల సేకరణకు గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేయగా.. ఒక్క దరఖాస్తు రాకపోవడం, పరిష్కారం కాకపోవడం కొసమెరుపు. ఇదిలా ఉండగా రూ.2లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందా.. లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి వివరాలను సేకరించకపోవడం, ఎలాంటి కదలిక లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా నాలుగో విడత కింద రూ.2లక్షల లోపు అర్హత ఉండి కానివారి రుణాలను, రూ.2లక్షలకు పైగా ఉన్న రుణాలను మాఫీ చేయాలని కోరుకుంటున్నారు.
కుటుంబ నిర్ధారణ చేయడంలో జాప్యం
ఇప్పటి వరకు 80 శాతం మంది వివరాలు యాప్‌లో నమోదు
పదిరోజులుగా యాప్ ఓపెన్‌కాక నిలిచిన ప్రక్రియ
రైతులకు తప్పని ఎదురుచూపులు
మూడు విడతల్లో మాఫీ ఇలా..
విడత రైతుల మాఫీ అయిన డబ్బు సంఖ్య (రూ.కోట్లలో)
మొదటి 56,217 282.78
రెండో 26,376 250.07
మూడో 12,757 213.24
ఈ ఫొటోలో కన్పిస్తున్న రైతు పేరు కనుకు సత్యనారాయణ. సొంతూరు జాజిరెడ్డిగూడెం మండలంలోని తిమ్మాపురం. 2019 లో సూర్యాపేటలోని కెనరా బ్యాంకు నుంచి రూ.1.40లక్షల పంట రుణం తీసుకున్నాడు. దీనికి రూ.6వేల వడ్డీ కలుపుకొని ప్రస్తుతం రూ.1.46లక్షల అప్పు అయ్యింది. ప్రభుత్వ నిబంధనల మేరకు మాఫీ కావాల్సి ఉన్నా కాలేదు. అధికారులను సంప్రదిస్తే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్‌లో ఒకేలా పేరు లేదని చెప్పారు. అసలు మాఫీ అవుతుందా..? కాదా..? అంతుపట్టడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment