తీరనున్న ఇసుక కొరత
అర్వపల్లి: ఇసుక దొరకక రెండు నెలలుగా తుంగతుర్తి నియోజకవర్గంలోని మూడు మండలాలతో పాటు సూర్యాపేట మండలంలో ఇళ్లు, ఇతర నిర్మాణాలు నిలిచిపోయాయి. తలాపునే మూసీనది ఉన్నా ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వకపోవడంతో నూతనంగా ఇళ్లు నిర్మించుకుంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటి వరకు సుమారు 2వేల వరకు ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. వివిధ రకాల ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సంబంధించిన నిర్మాణాలు కూడా ఆగాయి. అయితే మన ఇసుక–మన వాహనం విధానం అమలులోకి రావడంతో ఇసుక కష్టాలు తీరనున్నాయి.
నూతన ఇసుక విధానం అమలు
జాజిరెడ్డిగూడెం శివారులో మూసీనది ఉంది. ఇక్కడి నుంచే తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు సూర్యాపేట పట్టణానికి ఇసుక రవాణా అవుతుంది. ముఖ్యంగా తుంగతుర్తి, సూర్యాపేట, జాజిరెడ్డిగూడెం, నాగారం మండలాలకు నూతన విధానంలో ఇసుకను సరఫరా చేయనున్నారు. సెప్టెంబర్ 27న మన ఇసుక వాహనం విధానంను అధికారులు ప్రకటించారు. దీంతో ఇసుక కొరత తీరనుందని ప్రజలు సంతోషపడ్డారు. కానీ నెల రోజుల తర్వాత ఈ విధానం అమలులోకి వచ్చింది. ప్రస్తుతం నాలుగురోజుల నుంచి ఇసుక ట్యాక్సీ బుకింగ్‌లు మొదలయ్యాయి. ఈ విధానంలో ట్రాక్టర్‌కు 1 నుంచి 10 కి.మీ దూరం వరకు రూ.2,319, 11 నుంచి 15 కి.మీ వరకు రూ.2,445, 16 నుంచి 20 కి.మీ వరకు రూ.2,819, 21 నుంచి 25 కి.మీ వరకు రూ.3, 194 చొప్పున ఖర్చు కానుంది. ఈనెల 23 నుంచి ఇసుక సరఫరా మొదలు కానుంది.
బుకింగ్ మొదలైంది
మన ఇసుక –మన వాహనం ద్వారా ఇసుక ట్యాక్సీ బుకింగ్‌లు ఈనెల 16 నుంచి మొదలయ్యాయి. జాజిరెడ్డిగూడెం శివారులోని తుంగగూడెం వద్ద ఉన్న మూసీ నది క్వారీ నుంచి ఇసుక సరఫరా జరుగనుంది. ఇసుక ట్రాక్టర్ల సరఫరాకు దూరాన్ని బట్టి ధరలు నిర్ణయంచాం.
– జక్కర్తి శ్రీనివాసులు, తహసీల్దార్
అమలులోకి మన ఇసుక మన వాహనం
మొదలైన ఇసుక ట్యాక్సీ బుకింగ్
23వ తేదీ నుంచి సరఫరా
ఇక చకచకా కొనసాగనున్న
నిర్మాణ పనులు
Comments
Please login to add a commentAdd a comment