బంగారు, నగదు అందజేస్తున్న మంత్రి రాణిపేట గాంధీ, ఎంపీ జయకుమార్, ఎమ్మెల్యేలు
తిరువళ్లూరు: డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత మహిళ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు రాష్ట్ర చేనేత జ్ఙౌళిశాఖ మంత్రి రాణిపేట ఆర్ గాంధీ స్పష్టం చేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్హులైన 962 మందికి తాళిబొట్టుకి బంగారంతో పాటు నగదు అందజేసే కార్యక్రమం బుధవారం ఉదయం మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు డైరెక్టర్ సుఖపుత్ర అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర చేనేతశాఖ మంత్రి రాణిపేట ఆర్. గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా 2023–24వ సంవత్సరంలో అర్హులైన 962 మందికి 4.60 కోట్లు వ్యయంతో 7.7 కిలోల బంగారు నగలు, రూ.3.70 కోట్ల నగదును అందజేశారు. అనంతరం మంత్రి గాంధీ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 2021–22 , 2022–23 తదితర సంవత్సరాల్లో 4,128 మందికి 15.32 కోట్లు వ్యయంతో 33 కిలోల బంగారు నగలు, 45.39 కోట్లు రూపాయల నగదును తమ ప్రభుత్వం అందజేసిందన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత మహిళ హక్కునిధి, ప్రభుత్వ బస్సులో ఉచిత ప్రయాణం, వివాహ సహాయ నిధితో పాటు వేర్వేరు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్దికంగా బలోపేతం కావాలన్న మంత్రి, మహిళలు అభివృద్ధి చెందడం ద్వారా రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగి దేశాభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తారని తెలిపారు. ప్రస్తుతం తాళిబొట్టుకి బంగారు నాణేలను తీసుకుంటున్న వారిలో ఎక్కువగా డిగ్రీ చదివిన వారే ఉన్నారని, పెళ్లయిన తరువాత చదవును వదులుకోకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరువళ్లూరు పార్లమెంట్ సభ్యుడు జయకుమార్, ఎమ్మేల్యేలు వీజీ రాజేంద్రన్, దురైచంద్రశేఖర్, జెడ్పీ చైర్‌పర్సన్ కేవీజీ ఉమామహేశ్వరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment