ఆంధ్ర కళా స్రవంతిలో సంక్రాంతి సంబరాలు
కొరుక్కుపేట: చైన్నె కొరట్టూర్ అగ్రహారంలోని శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీ కోదండ రామాలయ ప్రాంగణాన్ని పచ్చని తోరణాలతో, చెరుకు గడలతో, ముగ్గులతో శోభాయమానంగా అలంకరించి వేడుకలను ఆరంభించారు. అనంతరం కొత్త మట్టి కుండల్లో పొంగళ్లు పొంగించి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. కోదండ రాముడిని వేడుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులను అందించారు. వేడుకల్లో భాగంగా ముగ్గుల పోటీలు, వంటలు పోటీలు నిర్వహించగా, వివిధ ప్రాంతాల నుంచి తెలుగు మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటుకున్నారు. అలాగే చైన్నె నుంగంబాక్కంలోని శ్రీ వెంకటేశ్వర తెలుగు ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు సంక్రాంతి విశిష్టత తెలుపుతూ ప్రదర్శించిన నాటిక, కోలాట నృత్యాలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జేఎం నాయుడు, కార్యదర్శి జె. శ్రీనివాస్, కోశాధికారి జీవి రమణ, సలహాదారులు ఎమ్మెస్ మూర్తి, ఉపాధ్యక్షులు కేఎన్ సురేష్ బాబు, ఇంకా ఎంఎస్ నాయుడు, ఓ. మనోహర్, ఈ బాలాజీ, సురేంద్ర సహా కార్యవర్గ సభ్యులు, మహిళ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముగ్గులు, వంటల పోటీల విజేతలకు బహుమతులను 4పీ ఇంటర్నేషనల్ బెల్లంకొండ బ్రదర్స్ తరపున సిల్వర్ కాయిన్‌లు, అలాగే పోటీల్లో పాల్గొన్న వారికి, న్యాయ నిర్ణేతలకు,, పాఠశాల ఉపాధ్యాయులకు ఐఎస్‌పీ గ్రూప్ తరపున ఆయిల్ ప్యాకెట్లు బహమతులుగా అందజేసి అభినందించారు. ఈ వేడుకల్లో న్యాయనిర్ణేతలుగా శేషారత్నం, అన్నపూర్ణ, రాధిక, కల్పన, ఇందుమతి, అలాగే క్రీడా పోటీలకు గజగౌరి, వీఎన్ హరినాథ్ వ్యవహరించారు. వేడుకల్లో ముందుగా గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment