ప్లస్‌–2లో బాలికల హవా | Sakshi
Sakshi News home page

ప్లస్‌–2లో బాలికల హవా

Published Tue, May 7 2024 10:20 AM

ప్లస్

రాష్ట్రంలో ఫ్లస్‌–2 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మొత్తం 94.56 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బాలికలు సత్తా చాటారు. పలు కీలక సబ్జెక్టులలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు వందకు వంద మార్కులు సాధించారు. ఇక జైలు జీవితం అనుభవిస్తున్న 115 మంది ఖైదీలు ప్లస్‌–2 పాస్‌ అయ్యారు. రాష్ట్రంలోనే అధిక శాతం ఉత్తీర్ణతతో తిరుప్పూర్‌ జిల్లా మొదటిస్థానంలో నిలిచింది.

ఫలితాల్లో మరోసారి పైచేయి

మొత్తం ఉత్తీర్ణత 94.56 శాతం

బాలికలు 96.44,

బాలురు 92.37 శాతం పాస్‌

తొలి స్థానంలో తిరుప్పూర్‌ జిల్లా

సాక్షి, చైన్నె : తమిళనాట ప్లస్‌–2 పరీక్షలను ఈ ఏడాది 7,60,606 మంది విద్యార్థులు రాశారు. ఇందులో బాలికలు 4,08,440, బాలురు 3,52,165, ఇతరులు ఒకరు ఉన్నారు. పరీక్షల అనంతరం ఎన్నికల ప్రక్రియ ఓ వైపు జరిగితే మరోవైపు వాల్యుయేషన్‌ మీద విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. సకాలంలో వాల్యుయేషన్‌ ముగించి డమ్మీ మార్కుల జాబితాను సిద్ధం చేసింది. ముందుగా నిర్ణయించిన మేరకు సోమవారం పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. సాధరణంగా విద్యా మంత్రి ఫలితాలను విడుదల చేయడం జరిగేది. ఈ సారి ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో పరీక్షల విభాగం డైరెక్టర్‌ సేతు రామవర్మ ఉదయం డీపీఐ ఆవరణలో ఫలితాలను విడుదల చేశారు. రిజిస్టడ్‌ మొబైల్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా తక్షణం విద్యార్థులకు ఫలితాల సమాచారాన్ని అందించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటించిన వెబ్‌సైట్ల ద్వారా మార్కుల వివరాలతో డమ్మీ జాబితాను పొందేందుకు అవకాశం కల్పించారు. ఆయా పాఠశాలలోని నోటీసు బోర్డులలోనూ ఫలితాలను ప్రకటించారు. తమ ఫలితాలను చూసుకుని విద్యార్థులు ఆనంద తాండవం చేశారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉత్తీర్ణతతో పాటు మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. శుభాకాంక్షలు తెలియజేశారు.

94.56 శాతం ఉత్తీర్ణత

మొత్తం 7,60,606 మంది పరీక్ష రాయగా 7,19,196 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 3,25,030, బాలికలు 3,93,890, ఇతరులు ఒకరు ఉన్నారు. జైలు ఖైదీలు 125 మంది పరీక్ష రాయగా 115 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా బాలికలే ఉత్తీర్ణత శాతంలో పై చేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 96.44 శాతం, బాలుర ఉత్తీర్ణత శాతం 92.37గా నమోదైంది. గత ఏడాది ప్లస్‌–2లో 94.03 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది 0.53 శాతం మంది అదనంగా పాస్‌ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 91.02 శాతం, ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలల విద్యార్థులు 95.49 శాతం, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 96.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

వందకు వంద మార్కులతో..

ఈ ఏడాది కీలక సబ్జెక్టులలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు వందకు వంద మార్కులు సాధించారు. సైన్స్‌ గ్రూప్‌ విద్యార్థులు 96.35 శాతం మంది, కామర్స్‌ గ్రూప్‌ విద్యార్థులు 92.46 శాతం మంది, ఆర్ట్స్‌ గ్రూప్‌ విద్యార్థులు 85.67 శాతం మంది, ఒకేషనల్‌ కోర్సు విద్యార్థులు 85.85 శాతం మంది ఉత్తీర్ణత సాఽధించిన వారిలో ఉన్నారు. తమిళ సబ్జెక్టులో 35 మంది, ఆంగ్లంలో ఏడుగురు, ఫిజిక్స్‌లో 633, కెమిస్ట్రీలో 471, బయాలజీలో 652, గణితంలో 2,587, బోటనిలో 90, జువాలజీ 382, కంప్యూటర్‌ సైన్స్‌లో 6,996, కామర్స్‌ 6,142, అకౌంటింగ్‌ రికార్డ్స్‌లో 1,647, ఎకనామిక్స్‌లో 3,299, కంప్యూటర్‌ అప్లిపకేషన్స్‌ 2251, బిజినెస్‌ మ్యాథమెటిక్స్‌ అండ్‌ స్టాటస్టిక్స్‌లో 210 మంది విద్యార్థులకు వందకు వంద మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. మొత్తం ఫలితాలలో తిరుప్పూర్‌ జిల్లా 97.45 శాతంతో తొలి స్థానాన్ని, శివగంగై, ఈరోడ్‌ జిల్లాలు 97.42 శాతంతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాయి. 97.25 శాతంతో అరియలూరు మూడో స్థానాన్ని, 96.97 శాతంతో కోయంబత్తూరు నాలుగో స్థానం కై వసం చేసుకోగా, 90.47 శాతం ఉత్తీర్ణతో తిరువణ్ణామలై జిల్లా చివరి స్థానంలో నిలిచింది. విద్యార్థులకు ఒరిజినల్‌ మార్కుల జాబితా జారీకి మరింత సమయం పట్టనున్న దృష్ట్యా, ఆన్‌లైన్‌లోని ప్రొవిజనల్‌(డమ్మీ) మార్కుల జాబితా ఆధారంగా ఉన్నత చదువులకు దరఖాస్తు చేసుకోవచ్చని సేతురామ వర్మ తెలిపారు. వారం రోజులలో తాత్కాలిక మార్కుల జాబితాను విద్యార్థులకు అందజేస్తామన్నారు. రీ వాల్యుయేషన్‌కు మంగళవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అని వివరించారు.

డాక్టర్‌ కావడమే లక్ష్యమన్న నివేదా..

ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారిలో ఒక హిజ్రా కూడా ఉన్నారు. చైన్నె ట్రిప్లికేన్‌కు చెందిన నివేదా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఆదివారం జరిగిన నీట్‌ పరీక్షకు హాజరయ్యారు. డాక్టరు కావాలనే ఆశతో తాను ఉన్నట్టు నివేదా పేర్కొన్నారు. అలాగే, చైన్నె కార్పొరేషన్‌ పరిధిలోని పాఠశాలలోనే కొడుంగయూరుకు చెందిన ఆటో డ్రైవర్‌ పార్తీబన్‌ కుమార్తె పూంగోదై 578 మార్కు లతో ముందు వరసలో నిలిచారు. తిరునల్వేలి జిల్లా నాంగునేరిలో పరీక్ష సమయంలో కులవివక్ష కారణంగా తీవ్ర కత్తి పోట్లకు గురైన చిన్నదురై 469 మార్కులు సాధించాడు. నీలగిరి జిల్లా కూడలూరులో తండ్రి మరణించిన వేదనతో పరీక్ష రాసిన తరుణ్‌ 358 మార్కులతో ఉత్తీర్ణత సాఽధించాడు.

న్యూస్‌రీల్‌

సీఎం శుభాకాంక్షలు..

పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సీఎం స్టాలిన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఫలితాల అనంతరం సీఎం స్టాలిన్‌ను విద్యాశాఖ మంత్రి అన్బిల్‌మహేశ్‌ కలిసి ఫలితాలకు సంబంధించిన సమగ్ర వివరాల నివేదికను అందజేశారు. ఈసందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఎం పేర్కొంటూ పాఠశాల విద్యను ముగించి కళాశాల జీవితంలోకి అడుగు పెట్టబోతున్న ప్రతి విద్యార్థికి తన అభినందనలు అని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో మరింత రాణించాలని, నైపుణ్యాలను అంది పుచ్చుకోవాలని, బాధ్యతతో ముందుకు వెళ్లాలని సూచించారు. తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని, తదుపరి అవకాశాలు ఎదురు చూస్తుంటాయని, ఇందులో రాణించేందుకు సిద్ధంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి సైతం శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, పరీక్షలలో ఫెయిల్‌ అయిన విద్యార్థులు మానసికంగా కుంగిపోకుండా ముందుజాగ్రత్తలపై ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చే విధంగా చైన్నెలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 14416, 104 నంబర్ల ద్వారా విద్యార్థులు సంప్రదించి కౌన్సెలింగ్‌ పొందవచ్చని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి గగన్‌దీప్‌ సింగ్‌ బేడీ తెలిపారు.

ప్లస్‌–2లో బాలికల హవా
1/4

ప్లస్‌–2లో బాలికల హవా

ప్లస్‌–2లో బాలికల హవా
2/4

ప్లస్‌–2లో బాలికల హవా

ప్లస్‌–2లో బాలికల హవా
3/4

ప్లస్‌–2లో బాలికల హవా

ప్లస్‌–2లో బాలికల హవా
4/4

ప్లస్‌–2లో బాలికల హవా

Advertisement

తప్పక చదవండి

Advertisement