సంచార కులాల స్థలం ఆక్రమణ
● ఆక్రమణల తొలగింపుపై పట్టించుకోని అధికారులు ● రెండు గంటలపాటు రాస్తారోకో
తిరువళ్లూరు: సంచార కులాలకు కేటాయించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపిస్తూ దాదాపు 300 మంది రాస్తారోకోకు దిగారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరువళ్లూరు జిల్లా సెంగుండ్రం సమీపంలోని ఒరకాడు అల్లినగర్ ప్రాంతంలో మూడువందల మందికి పైగా సంచార కులాలవారు నివాసం ఉంటున్నారు. ఈ స్థలాన్ని 1971వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు గోవిందరాజులు నాయుడు ఽభూధానం చేశారు. ఈ స్థలంలోనే చిన్నపాటి గుడిసెలను ఏర్పాటు చేసుకుని సంచార కులాలకు చెందిన కుటుంబాలు నివాసం ఉంటున్నారు. వీరికి ప్రధాన జీవనాధారం నల్లపూసలు, ప్లాస్టిక్ పువ్వుల విక్రయమే. అయితే అల్లినగర్ నుంచి తిరువళ్లూరు తదితర ప్రాంతాలకు నిత్యం వచ్చి రైలులో పూసలు వ్యాపారం నిర్వహించడం కష్టంగా మారింది. దీంతో వారందరూ తిరువళ్లూరు, ఆవడి, తిరునిండ్రవూర్ తదితర ప్రాంతాలకు వెళ్లి తాత్కాలిక నివాసం ఉంటున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు ప్రైవేటు వ్యక్తులు సంచార కులాలకు చెందిన గుడిసెలను తొలగించి ఆక్రమించుకున్నట్టు తెలుస్తోంది. భాదితులు తమకు చెందిన భూములను సర్వే చేసి అప్పగించాలని కోరుతూ సోమవారం ఉదయం కలెక్టర్‌ను కలవడానికి వచ్చారు. అయితే పోలీసులు అనుమతించకపోవడంతో తిరుపతి–చైన్నె జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు చర్చలు జరపడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment