● ఆందోళన చేపట్టిన గ్రామస్తులు
తిరువళ్లూరు: రోడ్డును ఆక్రమించుకుని ఆలయ నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ ప్రైవేటు వ్యక్తి హైకోర్టులో వేసిన పిటిషన్‌లో భాగంగా ఆలయ ప్రహరీగోడను రెవెన్యూ అధికారులు కూల్చివేసిన సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించిన క్రమంలో పుల్లరంబాక్కం గ్రామస్తులు అదివారం రాత్రి హిందూ ప్రజా పార్టీ నేతలతో కలిసి ఆందోళన నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా పుల్లరంబాక్కంలో ప్రసిద్ధి చెందిన శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీచందన గోపాలకృష్ణ శ్రీసంతాన వినాయకుడి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దాదాపు వందేళ్ల క్రితం నిర్మించారు. ఈ క్రమంలో ఆలయానికి సమీపంలో అదే గ్రామానికి చెందిన వనితశ్రీధరన్ కుటుంబం నివాసం ఉంటున్నారు. ఈ కుటుంబానికి, ఆలయ నిర్వాహకులకు మధ్య ఆలయానికి సమీపంలో ఉన్న స్థలంపై వివాదం ఉంది. సంబంధిత స్థల వివాదంపై వనితశ్రీధరన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. రోడ్డును ఆక్రమించి ఆలయాన్ని నిర్మించిన క్రమంలో కృష్ణుడి ఆలయాన్ని తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే గత గురువారం భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆలయాన్ని తొలగించడానికి అధికారులు రాగా వివాదం చెలరేగింది. దీంతో అధికారులు ఆలయానికి వెనుక వున్న గోడను మాత్రం తొలగించి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో హిందు ప్రజాపార్టీ నేతలతో కలిసి స్థానికులు ఆదివారం రాత్రి ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పార్టీ ప్రధాన కార్యదర్శి సెంథిల్ హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment