No Headline
సాక్షి, చైన్నె: 2026 ఎన్నికలలో అన్నాడీఎంకేతో పొత్తు ఉండదని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ స్పష్టం చేశారు. సంపూర్ణ మెజారిటీ లక్ష్యంగా ముందుకు సాగి అధికారం చేజిక్కించుకుంటామని వ్యాఖ్యానించారు. తమిళగ వెట్రి కళగం మహానాడు వేదికపై విజయ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో తమతో కలిసి వచ్చిపార్టీలకు అధికారంలో వాటా నినాదం రాష్ట్రంలోని రాజకీయ పక్షాలలో విస్తృత చర్చకు దారి తీసింది. అలాగే తమ ప్రత్యర్థులుగా బీజేపీ, డీఎంకేను ఎంపిక చేసుకున్న విజయ్ అన్నాడీఎంకేను పల్లెత్తి మాట్లాడలేదు. దీంతో అన్నాడీఎంకేతో కలిసి ప్రయాణం చేస్తారన్న చర్చ ఊపందుకుంది. ఇందుకు అనుగుణంగా ఓ తమిళ మీడియా ఆదివారం కథనం ప్రచురించింది. అన్నాడీఎంకే, తమిళగ వెట్రి కళగంల మధ్య రహస్య ఒప్పందాలు జరిగి ఉన్నట్టు, ఈ మేరకు 80 స్థానాలలో విజయ్ అభ్యర్థులు పోటీలో ఉంటారని ఆ కథనంలో వివరించారు. ఇది కాస్త వైరల్ కావడంతో విజయ్ అలర్ట్ అయ్యారు.
పొత్తు లేదు..
విజయ్ ఆదేశాల మేరకు తమిళగ వెట్రి కళగం వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ కథనాన్ని ఖండించారు. తప్పుడు సమాచారాలు, ఆధార రహిత కథనాలు వద్దని హితవు పలికారు. తమిళగ వెట్రి కళగం రాజకీయ ప్రయాణం పూర్తిగా తమిళనాడు ప్రజల సంక్షేమంతో ముడి పడి ఉందని వివరించారు. మహానాడు వేదికగా తమ నేత చేసిన వ్యాఖ్యలు, సిద్ధాంతాలను గుర్తుచేస్తూ, ప్రజా బలం, మద్దతు ద్వారా సంపూర్ణ మెజారిటీతో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజల రక్షణకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని, ఈ సమయంలో గందరగోళం సృష్టించే విధంగా వ్యవహరించ వద్దని సూచించారు. తమిళనాడు ప్రజల ఆదరణ, అభిమానం చూసి ఓర్వ లేకే కొందరు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేతో కూటమికి అవకాశం లేదని, వారితో పొత్తు లేదని పేర్కొంటూ, తమ ప్రయాణం ప్రజలతో అని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment