దక్షిణ రైల్వేలో సఫాయి కమిషన్ అధ్యయనం
ఇల్లు కట్టిస్తానని రూ.1.5 కోట్ల మోసం
ఆక్రమణలను తొలగించాలని వినతి
సాక్షి, చైన్నె: సఫాయి కర్మచారిల జాతీయ కమిషన్ గౌరవాధ్యక్షుడు ఎస్.వెంకటేషన్ బృందం మంగళవారం దక్షిణ రైల్వేలో అధ్యయనం చేసింది. దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్‌ఎన్ సింగ్, అధికారులు కౌశల్ కిషోర్, బి.విశ్వనాథ్ తదితర అధికారులతో సమావేశమయ్యారు. వివిధ క్లీనింగ్ కాంట్రాక్టుల కింద కాంట్రాక్టు ఉద్యోగుల విస్తరణకు సంబంధించి పలు ముఖ్యమైన పాలసీ మార్గదర్శకాలపై చర్చించారు. సఫాయి కర్మచారుల సామాజిక–ఆర్థిక, పని, సేవా పరిస్థితులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. స్టేషన్ క్లీనింగ్, ఆన్‌బోర్డ్ హౌస్‌కీపింగ్ స్టాఫ్, కోచ్ క్లీనింగ్, హౌస్ కీపింగ్, ట్రాక్ క్లీనింగ్ సిబ్బంది తదితర అవుట్‌సోర్స్ కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. సౌకర్యాలను ఆరాతీశారు. వారి జీతాలు, పని గంటలు, వారి కాంట్రాక్టు యజమానులు దీపావళి బోనస్ అన్న వివరాలను సేకరించారు. సఫాయి కర్మచారిలకు వారి పని ప్రదేశాలలో యూనిఫాం, తాగు నీరు ఇతర పని పరిస్థితుల పరిస్థితిని సమీక్షించారు.
ఇద్దరి అరెస్టు
తిరువొత్తియూరు: చైన్నె కొడుంగయూరు పార్వతి నగర్ బస్‌స్టేషన్ వెనుక అనుమానాస్పదంగా నిలబడి ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద తనిఖీ చేయగా చిన్నచిన్న పార్శిళ్లలో గంజాయి కలిగి ఉన్నారు. ఇద్దరినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేశారు. కొడుంగయూరు తిరువళ్లూరు రోడ్డు ప్రాంతానికి చెందిన మణి అనే వడైమణి(26), చోళవరం ప్రాంతానికి చెందిన శివ అనే వెంకటేశ్(27) అని తెలిసింది. వీరిద్దరిపై పలు కేసులు నమోదు ఉన్నాయి. వీరు గంజాయి విక్రయిస్తూ ఉన్నట్లు తెలిసింది. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.
గాంధీ విగ్రహం స్థలం మార్పుపై సమావేశం
తిరుత్తణి: మపోసీ రోడ్డు మార్గంలోని గాంధీ విగ్రహం స్థలం మార్పునకు సంబంధించి ఆర్డీఓ దీప అధ్యక్షతన మంగళవారం వివిధ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యాపార సంఘం నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సరస్వతి, తహసీల్దారు మలర్‌విలి, మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో నెలకొంటున్న ట్రాఫిక్ సమస్య పరిష్కరించే విధంగా ప్రస్తుతం మార్కెట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి ఎలాంటి మార్పు చేయకుండా తీసుకెళ్లి నూతన బస్టాండులో ఏర్పాటు చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా తీర్మానించారు. దీంతో త్వరలో గాంధీ విగ్రహాన్ని పటిష్ట భద్రత నడుమ తీసుకెళ్లి నూతన బస్టాండులో ఏర్పాట్లు చేయనున్నట్లు ఆర్డీఓ దీప తెలిపారు.
ఆదాయ పన్ను శాఖ ఆకస్మిక తనిఖీలు
తిరువళ్లూరు: ప్లాస్టిక్‌షీట్ వాహనాలకు హోస్ పైపులు తయారు చేసే పరిశ్రమల్లో అదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తిరువళ్లూరు జిల్లాలోని నయపాక్కం, గుమ్మిడిపూండి, శ్రీపెరంబదూరు తదితర ప్రాంతాల్లో పాలీహోస్ టోఫ్‌లీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఉంది. ఈ సంస్థలో ఇంటి పైకప్పులకు ఉపయోగించే రేకులు(షీట్‌లు) వాహనాలకు ఉపయోగించే ప్లాస్టిక్ పైపులు తయారు చేసి దేశం నలుమూలలకు సరఫరా చేస్తున్నారు. ఈ సంస్థకు మూడు వాహనాల్లో మంగళవారం ఉదయం అదాయపు పన్నుశాఖ అధికారులు పోలీసుల సాయంతో ప్రవేశించి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఆర్థిక లావాదేవీలు, వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతున్న వస్తువుల వివరాలు, ఉద్యోగుల సమాచారాన్ని పరిశీలించారు. పనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు తనిఖీ చేపట్టారు. ఆయుధాలు ధరించిన పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరుతో అవార్డు ఇవ్వొద్దు
● మ్యూజిక్ అకాడమీకి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
కొరుక్కుపేట: 2025 సంవత్సరానికిగాను సంగీత కళానిధి అవార్డును ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరుతో ఇవ్వవద్దు అని మ్యూజిక్ అకాడమీకి మద్రాసు హైకోర్టు మధ్యంతరంగా ఆదేశించింది. మ్యూజిక్ అకాడమీ వార్షిక కచేరీ సీజన్‌లో ‘సంగీత కళానిధి అవార్డు’ అందజేయడం ఆనవాయితీ. డిసెంబర్‌లో జరిగే 98వ వార్షికోత్సవ కార్యక్రమంలో గాయకుడు టీఎం కృష్ణకు ఈ అవార్డును అందజేస్తామని ప్రకటించారు. తన అమ్మమ్మపై అవమానకరమైన, నీచమైన, అపవాదు వ్యాఖ్యలు కృష్ణ చేసినట్టుగా ఆమె మనవడు శ్రీనివాసన్ తెలిపారు. కృష్ణకు వార్డును అందజేయకూడదని సుబ్బులక్ష్మి మనవడు పిటిషన్ వేశారు. పిటిషన్‌పై విచారణ న్యాయమూర్తి జి.జయచంద్రన్ ముందు మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. సంగీత కళానిధి అవార్డును ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరు మీద టి.ఎం.కృష్ణకు ఇవ్వవద్దు అని ఆదేశించారు.
● నిర్మాణ సంస్థ డైరెక్టర్ అరెస్ట్
అన్నానగర్: ఊటీలో ఇల్లు కట్టిస్తానని చెప్పి రూ.ఒకటిన్నర కోట్లు మోసం చేసిన చైన్నె నిర్మాణ సంస్థ డైరెక్టర్‌ను మంగళవారం అరెస్టు చేశారు. చైన్నె రాజా అన్నామలైపురం, శ్రీనివాస అవెన్యూకి చెందిన ఇగ్నాసిస్ థామస్ సురేష్(59) చైన్నె పోలీస్ కమిషనర్ అరుణ్‌కు ఓ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్యానయి. త్యాగరాయనగర్‌లో నిర్వహిస్తున్న ఎం.ఎస్.నాథన్ ఫౌండేషన్ అనే నిర్మాణ సంస్థ డైరెక్టర్ కేవీ శంకరలింగం ఊటీలో ఇళ్లు నిర్మించి విక్రయిస్తున్నట్లు ప్రచారం చేశాడు. 8 నెలల్లో ఫ్లాట్లు నిర్మించకుంటే నష్టపరిహారం ఇస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై ఆధారపడి థామస్, అతని భార్య, బావ, ఇద్దరు స్నేహితుల పేర్లతో మొత్తం 6 ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందుకు రూ.1కోటి 45 లక్షల 42 వేలు చెల్లించారు. కానీ కేవీ. శంకరలింగం మాత్రం ఫ్లాట్‌లు కట్టకుండా డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని పేర్కొన్నారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై విచారణకు కమిషనర్ అరుణ్ ఆదేశించారు. దీని ప్రకారం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కేవీ శంకరలింగాన్ని మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ నిర్మాణ సంస్థ బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయవచ్చని కేంద్ర నేర పరిశోధన విభాగం కోరింది.
తిరువళ్లూరు: వేపంబట్టులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను వెంటనే తొలగించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ వేషధారణతో వచ్చిన ప్రభుత్వ మాజీ ఉద్యోగి విశ్వనాథన్ కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్‌కు వినతి పత్రం సమర్పించారు. తిరువళ్లూరు జిల్లా 89–వేపంబట్టు గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన మునస్వామి, అజంతతోపాటు మరో ఐదుగురు వ్యక్తులు అక్రమంగా కట్టడాలను నిర్మించారు. ఈ కట్టడాల కారణంగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని, రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ విశ్వనాథన్ పలుసార్లు స్థానిక సర్పంచ్, బీడీఓతోపాటు ఇతర అధికారులకు వినతి పత్రాలు సమర్పించాడు. అయితే ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడంతో మంగళవారం ఎంజీఆర్ వేషధారణలో వచ్చి కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించాడు. కలెక్టర్ తక్షణం స్పందించి, ఆ ప్రాంతంలో పర్యటించి, అక్రమకట్టడాలను కూల్చి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. ఈ వినతి పత్రంపై తక్షణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎంజీఆర్ వేషధారణలో కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వ్యక్తితో పలువురు సెల్ఫీలు తీసుకోవడానికి యత్నించారు.
ఎంజీఆర్ వేషధారణలో కలెక్టరేట్‌కు వచ్చిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి
తాంబరం నుంచి మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు
సదరన్ రైల్వే అధికారులు ప్రకటన
కొరుక్కుపేట: చైన్నె ఎగ్మోర్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల కారణంగా సిలంబు ఎక్స్‌ప్రెస్ రైలుతోపాటు 3 ఎక్స్‌ప్రెస్ రైళ్లను తాంబరం నుండి తాత్కాలికంగా నడుపుతున్నట్లు సదరన్ రైల్వే ప్రకటించింది. ఈ మేరకు సదరన్ రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటన ఇలా ఉంది. ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఫలితంగా మూడు రైళ్ల సర్వీసులు తాత్కాలికంగా దారి మళ్లించబడ్డాయని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇలాగే నడుపబడతాయని వెల్లడించారు. చైన్నె ఎగ్మోర్–రాజస్థాన్ జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు(22663) ఈ నెల 23 నుండి ఎగ్మోర్‌కు బదులుగా తాంబరం నుండి నడుస్తుంది. మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరుతుంది. జోధ్‌పూర్–ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ (22664) ఈ నెల 26 నుండి తాంబరం వరకు నడుస్తుంది. చైన్నె ఎగ్మోర్–నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ (12667) ఈ నెల 21వ తేదీ నుంచి రాత్రి 7.30 గంటలకు తాంబరం నుంచి నడుస్తుంది. చైన్నె ఎగ్మోర్ –సెంగోట్టై సిలంబు ఎక్స్‌ప్రెస్ రైలు (20681) ఈనెల 20 నుండి తాంబరం నుండి రాత్రి 8.55 గంటలకు నడుస్తుంది. సెంగోట్టై–తాంబరం ఎక్స్‌ప్రెస్(20682) ఈనెల 21 నుండి తాంబరం వరకు మాత్రమే నడుస్తుందని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment