చక్కెర కర్మాగారంలో క్రషింగ్ ప్రారంభం
తిరుత్తణి: తిరుత్తణి సహకార చక్కెర కర్మాగారంలో చెరుకు క్రషింగ్‌ను గురువారం మంత్రి నాజర్ ప్రారంభించారు. తిరువలంగాడులోని తిరుత్తణి సహకార చక్కెర కర్మాగారంలో ఐదువేల మంది చెరుకు రైతులు సభ్యులుగా ఉన్నారు. రైతులు సాగు చేసిన చెరుకు పంటను సహకార చక్కెర ఫ్యాక్టరీకి సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీలో క్రషింగ్ కోసం రైతులు ఎదురు చూస్తున్న క్రమంలో గురువారం క్రషింగ్ ప్రారంభించారు. కార్యక్రమానికి తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ప్రభుశంకర్ అధ్యక్షత వహించారు. సహకార చక్కెర ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ నర్మద స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా జిల్లా మంత్రి నాజర్ పాల్గొని, క్రషింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరుత్తణి సహకార సంఘంలోని 7 డివిజన్లకు చెందిన చెరుకు రైతులు సహకార సంఘం నుంచి చెరుకు కట్టింగ్ అనుమతి పొంది సహకార ఫ్యాక్టరీకి తరలించి, లబ్ధి పొందాలన్నారు. క్రషింగ్ మధ్యలో ఆగకుండా యంత్రాలకు మరమ్మతులు పూర్తిచేసి ఉన్నత ప్రమాణాలతో క్రషింగ్ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సీజన్‌లో 2 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు క్రషింగ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు చంద్రన్, రాజేంద్రన్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment