న్యాయవాదుల నిరసన హోరు
● హైకోర్టు ఆవరణలో రాస్తారోకో
సాక్షి, చైన్నె : హోసూరులో న్యాయవాదిపై పట్ట పగలు జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా గురువారం, శుక్రవారం విధుల బహిష్కరణతో నిరసనలకు న్యాయవాద సంఘాలు నిర్ణయించాయి. న్యాయవాదులపై ఇటీవల కాలంగా పెరుగుతున్న దాడులతో, తమకు రక్షణ కల్పించాలన్న నినాదంతో ఈ పోరుబాట పట్టారు. హోసూరులో న్యాయవాదిని కణ్ణన్‌ను ఆనంద్‌కుమార్ అనే వ్యక్తి బుధవారం విచక్షణా రహితంగా నరికి పడేశాడు. ఆస్పత్రిలో అతడికి తీవ్ర చికిత్స కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడి భార్య, న్యాయవాది సత్యవతిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వెనుక వివాహేతర సంబంధం ఉందన్న సమాచారం వెలువడ్డప్పటికీ, పట్టపగలు ఓ న్యాయవాదిపై జరిగిన ఈ దాడిని న్యాయ వర్గాలు తీవ్రంగా పరిగణించారు. న్యాయవాద సంఘాలు పోరు బాట పట్టాయి. తమకు రక్షణ కల్పించాలని నినాదిస్తూ అనేక చోట్ల విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. దీంతో కోర్టు వ్యవహారాలకు ఆటంకం తప్పలేదు. సేలం, మదురై, తిరుచ్చి, తిరునెల్వేలి తదితర నగరాలలోని కోర్టులలో విధులను బహిష్కరించి న్యాయవాదులు ఆందోళనకు దిగారు. మద్రాసు హైకోర్టులో సాయంత్రం పెద్ద ఎత్తున న్యాయవాదులు రోడ్డు మీదకు వచ్చేసి ఆందోళనకు దిగారు. ఆ మార్గంలో రాస్తారోకోకు దిగడంతో వాహనాల రాక పోకలకు ఆటంకం తప్పలేదు. చివరకు పోలీసులు బుజ్జగించడంతో శాంతించారు. సైదా పేట, ఎగ్మూర్ కోర్టు న్యాయవాదులు సైతం ఆందోళన రూపంలో తమ నిరసనను తెలియజేశారు. అలాగే, న్యాయవాదులపై జరుగుతున్న దాడుల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బార్ కౌన్సిల్, పోలీసులు, హోం శాఖ ఈ వ్యవహారంపై చర్చించి సమన్వయంతో వివరాలను తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.
తిరువళ్లూరులో రాస్తారోకో
తిరువళ్లూరు: న్యాయవాదుల బద్రతకు కఠిన చట్టాన్ని రూపొందించాలని కోరుతూ తిరుపతి–చైన్నె జాతీయ రహదారిపై న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించారు. తమిళనాడు, పాండిచ్చేరి బార్ నిర్వాహకులు పిలుపు మేరకు తిరువళ్లూరు జిల్లాలోని ఊత్తుకోట, తిరువళ్లూరు, అంబత్తూరు, పొన్నేరితో పాటు వేర్వేరు ప్రాంతాల్లోని కోర్టులో విధులను బహిష్కరించి నినాదాలు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని న్యాయవాదులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment