క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘తార’
తమిళసినిమా: ఎంఆర్ ఫిలిం వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కార్తీకేశన్ కథను రాసి, ముఖ్య పాత్రను పోషించి నిర్మించిన చిత్రం తార. మణి మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మురుగా, పిడిచ్చిరుక్కు చిత్రాల ఫేమ్ అశోక్ కుమార్ కథానాయకుడిగానూ, నటి అను ప్రియా రాజన్ నాయకి గానూ నటించారు. మ్యాథ్యూ వర్గీస్, వర్షిణి, వెన్మది తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆర్ జే.నవీన్ ఛాయాగ్రహణం, రఘు శ్రవణ్ కుమార్ సంగీతాన్ని అందించారు. కాగా చిత్రం ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్ వి.ఉదయ్ కుమార్, కార్యదర్శి పేరరసు, నటుడు, డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు కె.రాజన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ తాను చాలా పొదుపు గల వ్యక్తినని పేర్కొన్నారు. తనతో చిత్రం చేయడం సాధారణ విషయం కాదన్నారు. అలాంటిది ఈ దర్శకుడు తారా చిత్రాన్ని అనుకున్న విధంగా తెరకెక్కించారని చెప్పారు. 25 ఏళ్ల క్రితం ఈ రంగంలో వచ్చి అవకాశాల కోసం ఎక్కిన మెట్టు ఎక్కకుండా కాళ్లు అరిగేలా తిరిగానని, అయినా అవకాశాలు రాకపోవడంతో వేరే రంగంలో వెళ్లి డబ్బు సంపాది ఇప్పుడు ఈ చిత్రం చేశానని చెప్పారు. పలువురి శ్రమే ఈ చిత్రం అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ తాను, నిర్మాత ముందుగా పక్కా ప్లాన్ చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. కథ ఆయన రాసినా, దర్శకుడిగా తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని చెప్పారు. కారైక్కాల్ ప్రాంతంలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా రూపొందించిన కథా చిత్రం తార అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment