క్లుప్తంగా
గుట్కా ప్యాకెట్లు తరలించిన వ్యక్తి అరెస్టు
తిరుత్తణి: ఆంధ్రా నుంచి ప్రైవేటు బస్సులో ని షేధిత మత్తు పదార్థాలు తరలించిన వ్యక్తిని పోలీసులు మంగళవారం అరె స్టు చేశారు. వివరాలు.. తిరుత్తణి సమీపంలోని చైన్నె తిరుపతి జాతీయ రహదారిలోని పొన్పాడి చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రా నుంచి తిరుత్తణి మార్గంలో ప్రవేశించే ప్రభుత్వ, ప్రయివేటు బస్సులు ఆపి సోదాలు చేశారు. ఈ సందర్భంగా బస్సు సీటు కింద నిషేధిత గుట్కా ప్యాకెట్లను గుర్తించి యువకుడిని అదుపులోకి తీసుకుని తిరుత్తణి పోలీసులకు అప్పగించారు. సీఐ మదియరసన్ కేసు నమోదు చేసి తిరువణ్ణామలై జిల్లాకు చెందిన పట్టురాజ్(37)ను అరెస్టు చేసి అతని నుంచి 6 కేజీల నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నూతన భవనం ప్రారంభం
తిరుత్తణి: తిరుత్తణిలోని పాత తహసీల్దారు కార్యాలయం వద్ద దుస్థితికి చేరుకున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనాన్ని కూల్చివేసి రూ. 1.63 కోట్లు వ్యయంతో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మించారు. కొత్త కార్యాలయం భవనం ప్రారంభోత్సవం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన భవనం పుష్పాలతో అలంకరించారు. సచివాలయం నుంచి సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతన భవనం ప్రారంభించారు. ఈ సందర్బంగా నూతన భవనం వద్ద మంత్రి నాజర్ స్వీట్లు పంచి వేడుకలు జరుపుకున్నారు. నూత న భవనంలో అత్యాధునిక వసతులతో సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రభుశంకర్, తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్, మున్సిపల్ చైర్‌పర్సన్ సరస్వతి, సహా అధికారులు పాల్గొన్నారు.
గంజాయి కేసులో అండమాన్ యువకుడు అరెస్టు
తిరువొత్తియూరు: చైన్నె కాశిమేడులో గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తున్న అండమాన్‌కు చెందిన యువకుడిని పోలీసుల అరెస్టు చేసి అతని వద్ద నుంచి 24 కిలోల గంజాను స్వాధీనం చేసుకున్నారు. కాశిమేడులో గత కొన్ని రోజుల క్రితము గంజాయి విక్రయిస్తున్న అదే ప్రాంతానికి చెందిన రౌడీ, రవి తో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు గంజ తరలించి తీసుకువచ్చి హోల్సేల్ వ్యాపారిగా ఉన్న అండమాన్‌కు చెందిన రాజీ రెడ్డి అనే పాపారావు (38)ను కాసిమేడు పోలీసులు అరెస్టు చేశారు అతని వద్ద నుంచి 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మరైమలై అడిగళార్ కుటుంబానికి ఎడపాడి ఆర్థిక సాయం
సేలం : ప్రముఖ తమిళ మేధావి మరైమలై అడిగళార్ కుటుంబానికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో.. ప్రసిద్ధి చెందిన తమిళ మేధావి తమిళ్ తంతై అనే పేరు గడించిన మరైమలై అడిగలార్ మనవరాలు, పట్టభద్రురాలైన లలితా తన భార్య, ఇద్దరు పిల్లలతో తంజావూరులో అద్దె ఇంటిలో అష్టకష్టాలు పడుతున్నారని, ఇంటికి అద్దె చెల్లించడానికి కూడా తగినంత ఆదాయం లేక బాధపుడుతున్నారనే విషయం తెలిసి తాను ఆవేదన చెందినట్టు తెలిపారు. అన్నాడీఎంకే పరిపాలనలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పేద ప్రజలకు సాయం చేయడంలో ముందుంటుంది. ఆ క్రమంలో తమిళ్ తందై మరైమలై అడిగలార్ కుటుంబ సంక్షేమం కోసం లక్ష రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేస్తున్నట్లు తెలిపారు.
తిరుత్తణి ఆలయ హుండీ ఆదాయం రూ. 1.58 కోట్లు
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయ హుండీ కానుకలుగా భక్తులు రూ. 1.58 కోట్లు చెల్లించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 35 రోజుల్లో హుండీల్లో భక్తులు చెల్లించిన కానుకలు ఆలయ జాయింట్ కమిషనర్ రమణి సమక్షంలో సోమవారం లెక్కింపు పనులు చేపట్టారు. ఇందులో ఆలయ సిబ్బంది వంద మంది పాల్గొన్నారు. అలాగే 776 గ్రాముల బంగారం, 9,870 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ అధికారులు విడుదల చేసిన ఓ ప్రకనటలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment