సూదుకవ్వుమ్–3 తప్పక ఉంటుంది
సూదుకవ్వుమ్–2 చిత్ర యూనిట్
తమిళసినిమా: 2013లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన చిత్రం సూదుకవ్వుమ్. తిరు కుమరన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సీవీ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 11 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌ను సూదుకవ్వుమ్–2 పేరుతో అదే సీవీ కుమార్ తంగం సినిమా సంస్థతో కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి ఎస్.జె.అర్జున్ దర్శకత్వం వహించారు. మిర్చి శివ, వాగై చంద్రశేఖర్, కరుణాకర్, రాధా రవి, ఎంఎస్ భాస్కర్, అరుళ్‌దాస్ రమేష్ తిలక్, యోగ్ జేబీ, హరీష్ జస్టిన్, కరాటే కార్తి, కల్కి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కార్తీక్ థిల్లై ఛాయాగ్రహణం, ఎడ్విన్ లూయిస్ విశ్వనాథ్, హరి ద్వయం సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 13వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాతల్లో ఒకరైన రంగరాజ్ మాట్లాడారు. నిర్మాత సీవీ కుమార్ చాలా సమస్యల్లో ఉన్నారని, ఆయనతో కలిసి చిత్రం చేయవద్దు అని చాలామంది తనకు చెప్పారన్నారు. అయితే తనకు సీవీ కుమార్‌పై నమ్మకం ఉందన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఆయన చిత్ర నిర్మాణ సంస్థకు మంచి పేరు ఉందన్నారు. ఇప్పటికీ నిర్మాతగా సీవీ కుమార్ 26 చిత్రాలు చేశారని తెలిపారు. సూదుకవ్వుమ్–2 చిత్రాన్ని కూడా విజయవంతంగా విడుదల చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తిరు కుమరన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అధినేత సీవీ కుమార్ మాట్లాడుతూ సూదుకవ్వుమ్ చిత్ర షూటింగ్ సమయంలోనే దీనికి సీక్వెల్‌పై ఐడియా ఉందన్నారు. సూదుకవ్వుమ్ చిత్రం విడుదలకు ముందు పలువురు మీడియా వాళ్లు, సినీ ప్రముఖులు విమర్శించారన్నారు. అయితే ఆ చిత్రం అందరి అంచనాలను మించి సూపర్ హిట్ అయిందన్నారు. నిర్మాత తంగరాజ్ చెప్పినట్లు తాను గత కొద్దికాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నానని, దీంతో ఆయన్ని కలిసి సూదుకవ్వుమ్– 2 చిత్రానికి చేయూతనివ్వమని కోరానన్నారు. తన గురించి పలు తప్పుడు ప్రచారాలు జరిగినా ఆయన తనను నమ్మి ఈ చిత్రానికి రూ.6 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారని చెప్పారు. సూదుకవ్వుమ్–2 చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని, దీనికి మూడవ సీక్వెల్‌ను కూడా ధర్మం వెల్లుమ్ పేరుతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment