● ప్రతి కార్యకర్తా.. సైనికుడిలా శ్రమించాలి ● 200 స్థానాల్లో గెలుపే మన టార్గెట్ ● కార్యవర్గం భేటీలో సీఎం స్టాలిన్ ● పలు తీర్మానాలకు ఆమోదం
సాక్షి, చైన్నె: చైన్నె తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం కలైంజ్ఞర్ అరంగంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, సీనియర్ నేతలు టీఆర్ బాలు, కేఎన్ నెహ్రూ, ఐ. పెరియస్వామి, పొన్ముడి, కనిమొళి, ఎ. రాజ, అందియూరు సెల్వరాజ్, ఆర్‌ఎస్ భారతీ వేదికపై ఆశీనులయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పథకాలు ప్రజలలోకి ఏ మేరకు దరి చేరుతున్నాయో అన్న వివరాలపై సమీక్షించి 2026 అసెంబ్లీ ఎన్నికలకు సమర శంఖం పూరించే విధంగా.. ప్రయాణానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఈసందర్భంగా స్టాలిన్ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా..
భారతదేశం అంతటా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యతను సైతం తమ భుజాన వేసుకున్నామని, ఇందులో భాగస్వామ్యమయ్యే విధంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా మారి గెలుపే లక్ష్యంగా పనిచేయడానికి సిద్ధం కావాలని పిలుపు నిస్తూ ప్రసంగాన్ని సీఎం స్టాలిన్ మొదలె ట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందుగా తాను ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి సోదర సోదరీమణులు శ్రమించి 40కు 40 స్థానాల కై వసం చేసుకోవడంలో సఫలీకృతులయ్యారని గుర్తు చేస్తూ అందర్నీ అభినందించారు. ఈ సమావేశంలో అనేక విషయాలను పంచుకున్నామని పేర్కొంటూ, ఆలోచనలను పంచుకోవాల్సిన అవసరం ఉందని, నిర్మాణాత్మకంగా సంస్థకు ప్రయోజనకరమైన, విజయానికి దారితీసే ఆలోచనలను ఇస్తే స్వీకరిస్తామని, ఆచరణలో పెడుతామని వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి మరో ఏడాదిన్నర కాలం మాత్రమే ఉందని, ఏడోసారిగా డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యం అని, ఈ ఎన్నికల్లో 200 నియోజకవర్గాల్లో కూటమి గెలుపునకు సంకల్పించామన్నారు. శ్రీకంటికి కనపడేంత దూరం శత్రువులు లేర్ఙు అని తాను గర్వంగా చెప్పేందుకు కారణం, ఎంత మంది వచ్చినా, ఎంతటి సైన్యాన్ని తీసుకొచ్చుకున్నా, వారి వ్యూహాలను పటా పంచెలు చేయడానికి కలైంజ్ఞర్ కరుణానిధి ఇచ్చిన శక్తి తనలో ఉందని, ఇదే తన నమ్మకం అని వ్యాఖ్యలు చేశారు. యాభై ఏళ్లుగా పైగా తాను చూశాను, ఎన్నికలకు వస్తే రాత్రి పగలు తేడా లేకుండా కలైంజ్ఞర్ పని చేసే వారు. ఆయన మార్గమే ఆదర్శం. ఆయన వ్యూహాలే ఎత్తుకు పై ఎత్తులు అని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎన్నో ఎన్నికలను చూశానని, ద్రావిడ సిద్ధాంతాలను నామ రూపాలు లేకుండా చేయాలనుకున్న వాళ్లే అడ్రస్ లేకుండా పోయారని గుర్తు చేశారు. డీఎంకేలోని సంస్థాగత వ్యవస్థే పార్టీకి పెద్ద బలం, అన్నా, కలైంజ్ఞర్ నిర్మించిన ఈ వ్యవస్థ మనందరిదీ అని పేర్కొన్నారు. ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని గుర్తు చేస్తూ, ఇప్పుడు ద్రావిడ మోడల్‌తో ఈ వ్యవస్థ గంభీరంగా దేశానికే మార్గదర్శకం, ఆదర్శకంగా మారి ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికీ, ప్రతి వీధికి, ప్రతి కుటుంబానికి, ప్రాంతానికి అన్ని విధాలుగా ఈ ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు దరిచేరాయని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నానని వివరించారు.
ఇరకాటంలో పెడుతున్నారు :
ప్రగతి పథంలో దూసుకెళ్తున్న తమిళనాడును ఎలా వెనక్కి నెట్టాలన్నదే అందరి ఆలోచన అని, ఇందులో ముందంజలో బీజేపీ ఉందని ఆరోపించారు. అన్ని రకాలుగా ఇరకాటం సైతం పెడుతున్నారని మండిపడ్డారు. ఒక్క తమిళనాడునే కాదు, యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యతను స్వీకరించామని వ్యాఖ్యలు చేశారు. గత మూడున్నరేళ్లుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న తన ప్రభుత్వాన్ని మరింత ఉత్తేజ పరిచే విధంగా వరసుగా విజయాలను రాష్ట్ర ప్రజలు అందిస్తూ వస్తున్నారని, ఇందుకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. 2019లో డీఎంకే కూటమి ఏర్పాటైందని గుర్తు చేస్తూ, ఇది నేటికీ విజయాల పర్వంతో కొనసాగుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు కూటమికి వ్యతిరేకంగా చాలా మంది రాజకీయ లెక్కలు వేస్తున్నారని పేర్కొంటూ, త్వరలో వారి లెక్కలన్నీ తప్పులో కాలేసినట్టే అని తేలబోతున్నాయన్నారు. ఓట్లను చీల్చేందుకు తమను వ్యతిరేకించే శక్తులన్నీ ఒంటరిగా వచ్చినా, కలిసి వచ్చినా 2026 ఎన్నికలలో గెలుపు డీఎంకేదే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో కూటమి గెలుస్తుంది! ఇది సాధారణ విజయం కాదు, చారిత్రాత్మక విజయం కాబోతోందన్నారు. గెలుపు తేలిగ్గా వస్తుందని ఎవరూ ఆత్మ సంతృప్తి చెందకూడదని, 200 స్థానాలే లక్ష్యంగా మరింతగా శ్రమించాల్సిన అవశ్యం ఏర్పడిందన్నారు. ఒక నియోజకవర్గం పరిధిలోని బ్లాక్, ప్రాంతం, గ్రామం, వార్డు...ఇలా ప్రతి చోటా మెజారిటీ సాధించే విధంగా కార్యకర్త పనితీరు, శ్రమ ఉండాలని పిలుపు నిచ్చారు. ద్రవిడ మున్నేట్ర కళగం, ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం సాగించే ఉద్యమం అని, ఇందులో ప్రజల కోసం శ్రమించే వారే తనకు అవశ్యం అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
తప్పుడు ఓటింగ్ శాతం లెక్కలు..
పలు తీర్మానాలు ఆమోదం..
ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. ఇందులో అంబేడ్కర్‌ను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన హోంశాఖ మంత్రి అమిత్ షా తీరును తీవ్రంగా ఖండించారు. పెంగల్ తుపాన్ సహాయ నిధులు మంజూరు చేయని కేంద్ర పాలకుల తీరును వ్యతిరేకిస్తూ, విపుత్తు నిర్వహణ నిది బీజేపీ పార్టీ నిధి కాదన్నది గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మదురైలో టంగ్‌స్టన్ మైనింగ్ తవ్వకాలను ఆదరిస్తున్న అన్నాడీఎంకే, బీజేపీ తీరును వ్యతిరేకిస్తూ, ఈ అనుమతులు రద్దు చేయాలని పట్టుబట్టారు. 2026 ఎన్నికలలో 200 స్థానాలలో గెలుపే లక్ష్యంగా తీర్మానించారు. విశ్వకర్మ పథకానికి వ్యతిరేకంగా నినాదిస్తూ, చేతి వృత్తి కళాకారులను ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. వాడవాడలా తిరువళ్లువర్ విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. విద్యావ్యాప్తి, తమిళనాడుకు విద్యా నిధుల పంపిణీలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఖండిస్తూ, జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు.
గత కొంత కాలంగా ప్రతిపక్ష నేత పళణి స్వామి ఓటింగ్ శాతం లెక్కలను పదే పదే గుర్తుచేస్తూ వస్తున్నారని వివరించారు. గాల్లో బాణాలు, ఊహలలో కోటలు అన్నట్టుగా ఆ లెక్కలు ఉన్నాయని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలలో అన్నాడీఎంకే ఓటు బ్యాంక్ పెరిగిందని చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేస్తూ, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకే 20 నియోజకవర్గాల్లో పోటీ చేసి 19.4 శాతం ఓట్లు తెచ్చుకుందని గుర్తుచేశారు. 2024 ఎన్నికల్లో 34 చోట్ల పోటీ చేసి 20.4 శాతం ఓట్లు తెచ్చుకున్నారని పేర్కొంటూ, అదనంగా 14 నియోజకవర్గాలలో పోటీ చేసినప్పుడు అదనంగా వారికి దక్కింది ఒక్క శాతం ఓటు బ్యాంక్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. టంగ్‌స్టన్ మైనింగ్ అనుమతిని, అంబేడ్కర్‌ను అవమానించిన వారిని పళణి స్వామి వ్యతిరేకించారా? అని ప్రశ్నిస్తూ, ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా? అని పళణి స్వామిని నిలదీశారు. డీఎంకే చరిత్ర అన్నది ఓ త్యాగం అని, అదే అన్నాడీఎంకేలో ద్రోహం తాండవం చేస్తుందని ఎద్దేవా చేశారు. ఇందులో పళణి స్వామి దిట్టా అని , ప్రజలను తప్పుదారి పట్టించడానికీ ఆయన వెనుకాడటం లేదని మండి పడ్డారు. అన్నాడీఎంకే, బీజేపీ, ఇంకా చెప్పాలంటే కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలు ఏదైనా సరే, సవాళ్లను అధిగమించి ఎదుర్కొనేందుకు తాను సిద్ధం అని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై మహిళలకు ఎంతో నమ్మకం ఉందని, దీనిని అనుకూల ఓట్లుగా మార్చుకోవాలని, కొత్త , యువత ఓటర్లనమ్మకాన్ని చురగొనాలని, వారి హృదయాలను గెలవాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఒక మాధ్యమంగా మారాలని, స్వయం సేవకులుగా అవతరించాలని పిలుపు నిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment