వెస్ట్ మాంబలంలో కుంగిన నేల..
● ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు ● మెట్రో రైలు భూగర్భ పనులతో ఘటన
సాక్షి, చైన్నె: చైన్నె వెస్ట్ మాంబలంలో జరుగుతున్న మెట్రో రైలు పనుల వల్ల అక్కడ ఉన్న ఇంటి నేల కుంగిపోయింది. వివరాలు..చైన్నె మహానగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు పనులు శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మెట్రో రైలు పనుల కారణంగా ఆయా చోట్ల కొన్ని సందర్భాలలో రోడ్లు, ఇళ్ల ప్లాంతాలలో నేల భూమిలోకి కుంగిపోవడం, పెద్ద గుంతలు ఏర్పడడం వంటివి అప్పుడప్పుడూ చోటు చేసుకుంటూ వస్తున్నాయి.
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో..
ఈ స్థితిలో చైన్నె వెస్ట్ మాంబలం మెట్రో రైలు పనుల కారణంగా ఇంటి లోపల నేల శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా కుంగిపోయింది. చైన్నె వెస్ట్ మాంబలం లాలా తోట్టంలోని రెండవ వీధిలో మెట్రో రైలు భూగర్భ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న ఒక ఇంటిలో అర్ధరాత్రి అకస్మాత్తుగా నేల కుంగింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. సమాచారం అందుకున్న వెంటనే మెట్రో నిర్వాహకులు అక్కడికి వెళ్లి పరిశీలించి ఆదివారం ఉదయం ఆ ఇంటిలో కుంగిన నేలపై సిమెంటు కలప వేసి సరి చేశారు. ఈ విషయం గురించి చైన్నె మెట్రో రైలు అధికారులు మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి నష్టం వాటిళ్లని రీతిలో మెట్రో పనులు నిర్వహిస్తున్నామన్నారు. కఠినమైన పెద్ద బండరాళ్లు, సుక రేణువులు అధికంగా ఉండే భూభాగాలలో ఇలాంటి చిన్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రస్తుతం ఇంటిలో కుంగిపోయిన నేలను మెట్రో సిబ్బంది సరి చేసినట్టు తెలిపారు. ఆ ఇంటిలోకి యజమానులు నివాసం చేరేంత వరకు మెట్రో నిర్వాహకులు అద్దెను కూడా ఇస్తున్నట్టు వారు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment