ఎస్‌ఐ పర్యవేక్షణలో కోర్టుల్లో తుపాకీ భద్రత
● రంగంలోకి ప్రత్యేక బృందాలు ● డీజీపీ ఆదేశాలు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని కోర్టులకు భద్రతను కట్టుదిట్టం చేస్తూ డీజీపీ శంకర్ జివ్వాల్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో కోర్టుకు సబ్ ఇన్‌స్పెక్టర్ పర్యవేణలో తుపాకీ భద్రతను కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇటీవల కాలంగా రాష్ట్రంలోని కోర్టుల ఆవరణలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విచారణకు హాజరయ్యే వారిని మట్టుబెడుతున్నారు. దాడులు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే న్యాయవాదులనే నరికి పడేస్తున్నారు. దీంతో న్యాయ లోకానికే భద్రత కరువైనట్టుగా పరిస్థితులు నెలకొంటున్నాయి. శుక్రవారం తిరునల్వేలిలో విచారణకు హాజరైన యువకుడిని కోర్టు సమీపంలో ప్రత్యర్థులు మట్టుబెట్టారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో పరిణామాలను మద్రాసు హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కోర్టులకు తుపాకీ భద్రత కల్పించాల్సిందేనన్న ఆదేశాలను జారీ చేసింది. దీనిని ఆచరణలో పెట్టే విధంగా డీజీపీ శంకర్ జివ్వాల్ అన్ని జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాలలోని కోర్టుల వివరాలతో సమగ్ర నివేదిక రూపకల్పన, ఆయా ప్రాంతాలలో చేపటాల్సిన భద్రత గురించి వివరించారు. ఒక్కో కోర్టు ఆవరణలో సబ్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షలో భద్రతకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సెకండ్ గ్రేడ్ కానిస్టేబుళ్లు, సాయుధ బలగాలతో తుపాకీ నీడలో భద్రత కల్పించే విధంగా బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాలలో చేపట్టిన, చేపట్టాల్సిన భద్రతకు సంబంధించిన సమగ్ర వివరాల నివేదికను తనకు పంపించాలని సూచించారు. రోజు వారిగా ఆయా కోర్టులలోని బృందాల నుంచి అక్కడి పరిస్థితులను సేకరించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment