శిక్ష తప్పదు!
‘అన్నావర్సిటీ లైంగిక దాడి కేసులో తప్పు ఎవరు చేసినా కఠిన శిక్షతప్పదు’ అని సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. నిందితుడికి చట్టం ద్వారా కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో మరెవరి ప్రమేయం లేదని చెప్పారు. సభలో సీఎం ఇచ్చిన వివరణతో ఏకీభవించని అన్నాడీఎంకే సభ్యులు ప్రభుత్వ తీరును ఖండిస్తూ వాకౌట్ చేశారు.
సీఎం స్టాలిన్‌తో కన్యాకుమారి ప్రతినిధులు
సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలలో మూడవ రోజు బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ అప్పావు ప్రశ్నోత్తరాలకు సమయం కేటాయించారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అనంతరం అన్నావర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి వ్యవహారం గురించి సభలో చర్చలకు అన్నాడీఎంకే, కాంగ్రెస్, పీఎంకేతో పాటూ వామపక్షాలు పట్టు బట్టారు. స్పీ కర్ అప్పావు అనుమతి ఇవ్వడంతో ఆయా పార్టీల తరపున ప్రతినిధులు ఈ వ్యవహారంపై ప్రసంగించారు. అన్నాడీఎంకే, పీఎంకే, బీజేపీ సభ్యులు ప్రభుత్వంపై రాజకీయ దాడిచేస్తూ వ్యాఖ్యల తూటాలను పేల్చాయి. డీఎంకే మిత్రపక్షాలు అయితే గవర్నర్‌ను సైతం ఈ వ్యవహారంలో గురి పెట్టాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే కాదు, గవర్నర్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని పట్టుబట్టారు. విద్యా సంస్థలకు చాన్స్‌లర్‌గా ఆయన వ్యవహరిస్తున్న దృష్ట్యా, ఆయన కూడా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ చివర్లో ప్రసంగించారు. ఈ సమయంలో అన్నాడీఎంకే హయంలో జరిగిన పొల్లాచ్చి లైంగిక దాడి కేసును గుర్తు చేశారు. అప్పటికే సభకు నల్ల వస్త్రాలను ధరించి, ఎవరో ఆ సారు అన్న బ్యాడ్జీలతో వచ్చిన అన్నాడీఎంకే సభ్యులు సీఎం స్టాలిన్ పేల్చిన వ్యాఖ్యల తూటాలను నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక స్పీకర్ అప్పావు స్పందిస్తూ తమిళ ప్రజలను, తమిళ అసెంబ్లీని గవర్నర్ అవమానించడాన్ని గుర్తు చేస్తూ, దీనిని ఖండిస్తున్నామని ప్రకటించారు. సభలో తమిళ తల్లి గీతం కంటే ముందుగా జాతీయ గీతం ఆలపించాలని డిమాండ్ చేసే హక్కు గవర్నర్‌కు లేదని స్పష్టం చేశారు.
డీఎంకే కార్యకర్త కాదు..
ఈ కేసులో విచారణ వేగవంతంగా సాగుతోందని, 60 రోజులో చార్జ్‌షీట్ కూడా దాఖలు చేస్తారని స్పష్టం చేశారు. ప్రత్యేక కోర్టు ద్వారా త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిందితుడికి గరిష్టంగా శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఎవరో ఆ సార్ ..? అని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయని గుర్తు చేస్తూ, ఇందుకు సంబంధించిన ఆధారాలు నిజంగా ఉంటే దర్యాప్తు బృందానికి అప్పగించాలని, సున్నిత విషయాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు అని హితవు పలికారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, ఇది ప్రతి ఒక్కరికీ తెలుసునని వివరించారు. మహిళలపై 86 శాతం కంటే ఎక్కువ కేసుల్లో 60 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేశామని, పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత గురించి 2 లక్షల 39 వేలకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. సత్య అనే యువతిని రైలు ముందు తోసి చంపిన కేసులో నిందితుడికి మరణ శిక్ష పడేలా చర్యలు తీసుకున్నామన్నారు. మహిళలు, పిల్లలపై నేరాలకు పాల్పడే వాళ్లు ఎంతటి వారైనా సరే ఉపేక్షించ బోమని హెచ్చరించారు. భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల జాబితాలో టాప్ 10లో చైన్నె ఉందని, ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలకు వెళ్లే రాష్ట్రాల జాబితాలో తమిళనాడు ముందంజలో ఉందని వివరించారు. 10 లక్షల కంటే తక్కువ జనాభాతో కలిగిన తిరుచ్చి, వేలూరు, ఈరోడ్, సేలం, తిరుప్పూర్ అత్యంత సురక్షిత నగరాలు ఉన్నాయని వివరిస్తూ.. అన్నాడీఎంకే పాలనలో జరిగిన ఘటనలను ఏకరువు పెడుతూ ఎదురు దాడికి దిగారు. పొల్లాచ్చి లైంగిక దాడి ఘటనను వివరిస్తూ, ఈ సమయంలో అన్నాడీఎంకే పాలకుల ఒత్తిడితో పోలీసులు కేసులు కూడా నమోదు చేయలేదన్న విషయాన్ని సభలో ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో అప్పట్లో బీజేపీ సైతం నోరు విప్పిందా? అని ప్రశ్నించారు. వారి తరహాలో సభా గౌరవాన్ని దిగజార్చడం తనకు ఇష్టం లేదని, ప్రభుత్వంపై ఆరోపణలు వస్తే బాధ్యతతో సమాధానం ఇస్తున్నామని, చైన్నె ఘటనలో మరెవరికై నా సంబంధం ఉందని సిట్ విచారణలో వెలుగు చూసిన పక్షంలో వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ కేసులో నిందితుడు తమ పార్టీ కార్యకర్త కాదని, సానుభూతి పరుడు అని వివరణ ఇచ్చారు. అనుమతి లేని ప్రదేశాలలో డీఎంకే సభ్యులు ఆందోళనలు చేశారంటూ కూడా పోలీసులు కేసులు పెట్టారని, ఒక్కసారి ప్రతి పక్షాలు ఆలోచించాలని హితవు పలికారు. ఇదిలా ఉండగా సభకు బుధవారం కూడా ప్రధాన ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పళణి స్వామి హాజరు కాలేదు. ఆయనకు జ్వరంగా ఉండటంతోనే రానట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. ఇక, సీఎం స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ శాసన సభ్యురాలు వానతీ శ్రీనివాసన్ పేర్కొంటూ, ఈ కేసులో నిందితుడు సీనియర్ మంత్రులతో సైతం సన్నిహితంగా ఉండేంతగా శక్తి వంతుడైన సానుభూతిపరుడా? అని ప్రశ్నించారు. అనంతరం సచివాలయంలో సీఎం స్టాలిన్‌ను నాగర్ కోయిల్, కన్యాకుమారికి చెందిన ప్రజాప్రతినిధులు కలిశారు. తివ్రేణి సంగమ క్షేత్రంలో తిరువళ్లువర్ సిల్వర్‌జూబ్లీ వేడుకలలో భాగంగా కన్యాకుమారికి మునిసిపాలిటీ హోదా కల్పించినందుకు గాను సీఎం స్టాలిన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం వివరణ..
ఈ ఘటనపై సీఎం స్టాలిన్ స్పందిస్తూ ముందుగా ఇక్కడ మాట్లాడిన వారంతా అన్నావర్సిటీ అన్న పేరును ప్రస్తావించారని గుర్తు చేస్తూ, సభా రికార్డుల నుంచి దయ చేసి ఆ వర్సిటీ పేరును తొలగించాలని స్పీకర్ అప్పావును విజ్ఞప్తి చేశారు. ఒక ఘటన కారణంగా ఆ వర్సిటీకి, పేరుకు కళంకం తీసుకు రావద్దని విన్నవించారు. చైన్నెలో జరిగిన ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంటూ, సభ్యులు జగన్ మూర్తి, వేల్ మురుగన్, ఈశ్వరన్, సదన్ తిరుమలై కుమార్, మారి ముత్తు, నాగై మాలి, సిందనై సెల్వన్, ఎంఆర్ గాంధి, జీకేమణి, ఆర్‌బీ ఉదయకుమార్ తదితరులు తమ ప్రసంగాలలో ఓ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తూ మాట్లాడారని వివరించారు. బాధితురాలి పక్షాన నిలబడి, ఆమెకు చట్టపరంగా న్యాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని నిందించే విధంగా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ, ఘటన జరిగిన గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్టు చేశామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు రాగానే కోట్టూరు పురం పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టి, నిందితుడు జ్ఞాన శేఖర్‌ను అరెస్టు చేసి కట కటాలలోకి నెట్టారని పేర్కొన్నారు. అయితే, ప్రతిపక్షాలు ఏమని ఆరోపిస్తున్నాయో? అని పేర్కొంటూ, ఎఫ్‌ఐఆర్ లీక్ అయిందని, ఇందుకు బాధ్యులెవరో? అని ప్రశ్నిస్తున్నారని ప్రతి విషయానికి పోలీసులు వివరణ ఇవ్వగానే, తక్షణం భద్రత లేదంటూ నినాదం అందుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడేమో ఎవరో ఆ సారు? అని ప్రశ్నిస్తున్నారని పేర్కొంటూ, ఈ కేసును హైకోర్టు ఆదేశాలో ఏర్పాటు చేసిన సిట్ బృందం విచారిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని సూచించారు.
అన్నావర్సిటీ ఘటనపై సీఎం స్టాలిన్
ఈ కేసులో మరెవరూ లేరని స్పష్టీకరణ
సభకు పాకిన లైంగిక దాడి వ్యవహారం
అన్నాడీఎంకే వాకౌట్
Comments
Please login to add a commentAdd a comment