ముట్టుకాడులో ‘ఫ్లోటింగ్ రెస్టారెంట్’
– ప్రారంభించిన మంత్రులు
సాక్షి, చైన్నె: ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఉపయోగంలోకి వచ్చింది. ముట్టుకాడులో ప్రత్యేక ఏర్పాట్లతో పర్యాటక శాఖ సిద్ధం చేసిన ఈ రెస్టారెంట్‌ను మంత్రులు రాజేంద్రన్, అన్బరసన్‌లు ప్రారంభించారు. వివరాలు.. చైన్నె నగర శివారులోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో పర్యాటక శాఖ నేతృత్వంలో అతి పెద్ద బోటింగ్ హౌస్ ఉన్న విషయం తెలిసిందే. ముట్టుకాడు వద్ద ఉన్న ఈ బోటింగ్ హౌస్ సముద్ర ముఖ ద్వారం, బకింగ్ హాం కాలువ నీటి ఆధారంగా 1984లో ఏర్పాటు చేశారు. ఇది చైన్నె అడయార్ నుంచి 23 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ 15 అతివేగం, 27 సాధారణ వేగం, మరో 9 సైక్లింగ్ బోట్లు ఉన్నాయి. ఇక్కడకు నిత్యం పర్యటకుల రాక అధికంగానే ఉంటుంది. అందుకే ఈ బోట్‌హౌస్‌ను మరింత అభివృద్ధి పరిచే విధంగా రూ. 5 కోట్లతో 125 అడుగుల పొడువు, 25 అడుగుల వెడల్పుతో రెండు అంతస్తులతో నీటిపై తేలియాడే చిన్న పాటి నౌక తరహాలో లగ్జరీ రెస్టారెంట్‌కు( ఫ్లోటింగ్ రెస్టారెంట్ – తేలియాడే) నిర్ణయించారు. ఈ పనులను కొచ్చిన్‌కు చెందిన ఓ సంస్థ చేపట్టింది. ఈ రెస్టారెంట్ పనులు ప్రస్తుతం ముగిశాయి. రెండు అంతస్తులతో బ్రహ్మాండ హంగులతో తేలియాడే రెస్టారెంట్‌ను సిద్ధం చేశారు. ఇందులో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. పైభాగంలో కూర్చుని ఆహ్లాదకర వాతావరణంలో రెస్టారెంట్‌లో కావాల్సిన ఆహారాలను స్వీకరించేందుకు వీలుగా సందర్శకులు, పర్యాటకులకు ప్రత్యేక వసతులు కల్పించారు. ఇక్కడ అందించే వంటకాలు మెను సిద్ధం చేశారు. ఈ బోట్ రెస్టారెంట్‌ను మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారులు చంద్ర మోహన్, శిల్ప ప్రభాకర్, తాంబరం ఎమ్మెల్యే రాజ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడులోనే తొలి తేలియాడే రెస్టారెంట్ ఇదే కావడం విశేషం. సెలవు రోజుల్లో కుటుంబాలతో సహా నగర, శివారు వాసులు, పర్యాటకులు పెద్దసంఖ్యలో పర్యాటకులు ముట్టు కాడుకు తరలి వచ్చి పడవ సవారీ చేసి ఆనందంగా గడుపుతుంటారు. ప్రస్తుతం ఇక్కడ తొలి ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటు కావడంతో ముట్టుకాడుకు మరింత వన్నె వచ్చినట్లయ్యింది. రెండు అంతస్తులు కలిగిన ఈ రెస్టారెంట్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఎయిర్ కండిషన్ సౌకర్యంతోను, పై అంతస్తు ఆహ్లాదకర వాతావరణంలో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ కూర్చుని ప్రయాణిస్తూ భుజించే విధంగా రూపొందించారు. వంట గది, స్టోర్ రూం, మరుగుదొడ్లు వంటివి ఉన్నాయి. ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ 60 హార్స్ పవర్ సామర్థ్యంతో నడిచే విధంగా ఇంజిన్లను ఏర్పాటు చేశారు. వివాహాలు, పుట్టిన రోజులు వంటి వేడుకలకు ప్రత్యేక బుకింగ్ ద్వారా సైతం అందించే విధంగా చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment