ఈరోడ్ తూర్పులో నిఘా కట్టుదిట్టం
● సరిహద్దులలో వాహన తనిఖీలు ● అమలులోకి కోడ్ ● 3 రోజులే నామినేషన్లకు అవకాశం
సాక్షి, చైన్నె: ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. కోడ్ అమలుతో సరిహద్దులలో చెక్ పోస్టులు బుధవారం వెలిశాయి. వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. నామినేషన్ల స్వీకరణకు వరుస సెలవులు అడ్డంకిగా మారింది. దీంతో మూడు రోజులే నామినేషన్ల స్వీకరణకు సమయం కేటాయించారు. వివరాలు.. ఈవీకేఎస్ ఇలంగోవన్‌మరణంతో ఖాళీగా ఉన్న ఈరోడ్ తూర్పు నియోజకవర్గానికి ఎన్నికల నగారా మంగళవారం మోగిన విషయం తెలిసిందే. ఈనెల 10వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నికల నగారా మోగడంతో కోడ్ అమలులోకి వచ్చింది. నియోజకవర్గ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు అయ్యాయి. ఈ నియోజకవర్గం ఈరోడ్‌నగర పరిధిలోనే ఉండడం, ఈ పరిసరాలు వస్త్ర ఉత్పత్తులు, విక్రయ కేంద్రాలతో నిండి ఉండటంతో ఇక్కడకు వచ్చే వాళ్లు నగదు తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సిందే. లేని పక్షంలో తనిఖీలలో పట్టుబడితే సీజ్ చేయడం ఖాయం. ఈ నియోజకవర్గం చుట్టూ ఉన్న ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలకు చర్యలు తీసుకున్నారు. కాగా నియోజకవర్గం పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్ అధికారి ఏర్పాట్లు చేపట్టారు. దీంతో మళ్లీ ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈనెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే సంక్రాంతి సెలువులు నామినేషన్లకు అడ్డంకిగా మారాయి. 10, 13, 17 తేదీల్లో మాత్రమే నామినేషన్లు స్వీకరించేందుకు అవకాశం ఉంది. మిగిలిన రోజులన్నీ సెలవు దినాలు కావడం గమనార్హం. దీంతో అభ్యర్థులను త్వరితగతిన ఎంపిక చేయడానికి డీఎంకే కూటమి, అన్నాడీఎంకే, బీజేపీ సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికల కసరత్తులలో భాగంగా సీటు తమకే అప్పగించాలని డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ను కలిసి విన్నవించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. గురువారం స్టాలిన్‌ను కలిసేందుకు కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఈ ఎన్నికలలో పోటీ చేయాలా? లేదా బహిష్కరించాలా? అన్న ఆలోచనలో అన్నాడీఎంకే ఉంది. ఈనెల 11వ తేదీన తమ నిర్ణయాన్ని ప్రకటించే విధంగా జిల్లాల కార్యదర్శుల భేటీకి నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment