తమిళులు అన్నింటా ముందుండాలి
● వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్
వేలూరు: తమిళులు అన్ని రంగాల్లో ముందుండాలని వేలూరు వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ అన్నారు. వీఐటీ యూనివర్సిటీ ఆవరణలో ఇతర దేశాల విద్యార్థులతో కలిసి చాన్స్‌లర్ ముందస్తు సంక్రాంతి వేడుకలను బుధవారం జరుపుకున్నారు. పారంపర్య తమిళ సంప్రదాయ క్రీడలైన కోలాటం, కబడ్డీ, కరగడ్యాన్స్, పులి వేషాలు ధరించి విద్యార్థులు వీఐటీ యూనివర్సిటీ ప్రాంగణంలో కోలాహాలంగా సాగింది. చాన్స్‌లర్ విశ్వనాథన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థినులు తమిళ సంప్రదాయ దుస్తులు ధరించి పొంగళ్లు పెట్టారు. అదేవిధంగా వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఎద్దుల బండిలో ఎక్కి పొంగులో, పొంగల్ అంటూ యూనివర్సిటీ ప్రాంగణంలో కలియదిరిగారు. అనంతరం వివిధ దేశాలకు చెందిన విద్యార్థులతో కలిసి తమిళ్ ఇలక్కియ మండ్రం ఆధ్వర్యంలో వీఐటీ ప్రాంగణంలోని చాన్స్‌లర్ విశ్వనాథన్ అధ్యక్షతన పొంగల్ పెట్టి విద్యార్థులకు పొంగల్‌ను ప్రసాదంగా అందజేశారు. చైనా, అమెరికా దేశాలకు చెందిన విద్యార్థులు తమిళ సంప్రదాయ పద్ధతిలో చీరలు ధరించి పొంగళ్లు పెట్టడం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా చాన్స్‌లర్ విశ్వనాథన్ మాట్లాడుతూ దేశంలో మూడు వేల సంవత్సరాల తర్వాత కూడా తమిళ భాష ఇంకా యువ్వనంగా ఉందన్నారు. తమిళులు బలంగా ఉండాలని, మంచి వారుగా ఉండాలని, తిరుకురల్ చదివి దానికి నిదర్శనంగా ఉండాలన్నారు. వీఐటీ యూనివర్సిటీలో మొత్తం 55 దేశాలకు చెందిన విద్యార్థులు వివిధ భాషలు కలిగిన వారుగా ఉన్నారన్నారు. వారందరితో పాటూ తమిళ సంప్రదాయాన్ని తెలిపే విధంగా సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా వీఐటీలో ప్రస్తుతం 40వ వార్షిక ముందస్తు సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. అదే విధంగా రైతులను, వ్యవసాయాన్ని ఉత్సాహ పరిచేందుకే ఈ సంక్రాంతి పడుగను జరుపుకుంటారని రైతులు, వ్యవసాయం లేదంటే మనం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షులు శేఖర్, కాదంబరి విశ్వనాథన్, వైస్ చాన్స్‌లర్ కాంచన, ప్రొ చాన్స్‌లర్ పార్థసారథి మల్లిక్, రిజిస్టార్ జయభారతి, తమిళ ఫ్రొఫెసర్‌లతో పాటూ వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment