క్లుప్తంగా
రూ. 2.15 కోట్లతో విల్లివాక్కం అగతీశ్వరర్ ఆలయం పనులు
● ప్రారంభించిన
మంత్రి పీకే శేఖర్‌బాబు
కొరుక్కుపేట: విల్లివాక్కం అగతీశ్వరర్ ఆలయంలో రూ.2.15 కోట్లతో గోపురంపై నూతనంగా 5 అంచెల రాజగోపురం నిర్మాణానికి మంత్రి పి.కె.శేఖర్‌బాబు సోమవారం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత విల్లివాక్కం, దేవిబాలియమ్మన్ ఆలయం, వరసిద్ధి వినాయగర్ ఆలయం, దామోదరపెరుమాళ్ ఆలయాన్ని కూడా సందర్శించి పరిశీలించారు. విల్లివాక్కం అగతీశ్వర ఆలయంలో రాజుల కాలంలో నిర్మించిన మోటై గోపురంపై దాతల ఆర్థిక సహకారంతో ఐదు అంచెల రాజగోపురం నిర్మించే పనులు ప్రారంభించామని తెలిపారు. ఈ రాష్ట్రంలో కుంభాభిషేకం సందర్భంగా 2,392 దేవాలయాల్లో కోట్ల వ్యయంతో 80 కొత్త రాజగోపురాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇందులో 11 రాజగోపురం పనులు పూర్తయ్యాయి. రూ.58 కోట్ల అంచనా వ్యయంతో 197 రాజగోపురాల మరమ్మతు పనులు చేపట్టగా 94 పనులు పూర్తయ్యాయన్నారు. 7,387 ఎకరాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విల్లివాక్కం ఎమ్మెల్యే శ్రీధర్, అధికారులు పాల్గొన్నారు.
ఏడేళ్ల బాలుడు మద్యం
సేవించిన వీడియో వైరల్
● బాబాయి అరెస్టు, తండ్రి కోసం గాలింపు
అన్నానగర్: తిరుచ్చి జిల్లాకు చెందిన 7 ఏళ్ల బాలుడు మద్యం సేవించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తిరుచ్చి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సెల్వ నాగరత్నం ఆదేశాల మేరకు కనక్కలియానల్లూర్ సబ్ ఇన్‌స్పెక్టర్ భూపతి నేతృత్వంలో పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడి తండ్రి, అతని బాబాయి మద్యం అందించినట్లు వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి బాబాయిని సోమవారం అరెస్ట్ చేసి లాల్గుడి జైలుకు తరలించారు. అలాగే ఈ కేసులో పరారీలో ఉన్న బాలుడి తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చేరిన 6 ఏళ్ల బాలిక
● మంత్రి ఎం. సుబ్రమణియన్ అభినందన
అన్నానగర్: చైన్నె గిండి ఐ.ఐ.టి. క్యాంపస్‌లోని వనవాణి మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో తమిళిని (6) ఒకటో తరగతి చదువుతోంది. ఈమె ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ పుస్తకంలో రికార్డు సృష్టించింది. మొత్తం 247 తమిళ అక్షరాలను నిమిషం 14 సెకన్లలో పాట రూపంలో చదివి వినిపించిన చిన్నారిని.. సోమవారం తన తల్లిదండ్రులు రామసామి మాధవన్, రాజ్ సీతతో కలిసి ఆరోగ్య, ప్రజా సంక్షేమ శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యన్‌ను కలిశారు. అనంతరం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ జారీ చేసిన సర్టిఫికెట్, మోడల్, పెన్ను, బ్యాడ్జీని బాలిక తమిళిని మంత్రికి చూపించారు. ఈ సందర్భంగా బాలికను మంత్రి అభినందించారు.
గాలిపటం దారం గొంతుకు
చిక్కుకుని ప్రమాదం
● మహిళా కానిస్టేబుల్‌కు
తీవ్రగాయాలు
తిరువొత్తియూరు: చైన్నె పుదుపేట పోలీస్ క్వార్టర్స్‌లో నివాసముంటున్న రమ్య (25) అమైందకరై పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం పుదుపేట పోలీసు క్వార్టర్స్ నుంచి అమైందకరై పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు. అమైందకరై స్కైవాక్ వంతెనపై వెళ్తుండగా గాలిలో ఎగురుతూ వచ్చిన మాంజాదారం రమ్య గొంతుకు చిక్కుకుంది. తీవ్ర గాయంతో కిందపడిన ఆమెను వెంటనే స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి చేర్చారు. విచారణలో మాంజాదారంతో గాలిపటం వదిలిన అమైందకరై ప్రాంతానికి చెందిన నలుగురు బాలురులను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేసి తీవ్రంగా హెచ్చరించి పంపించి వేశారు.
అంగళమ్మన్ ఆలయంలో
దుర్గా స్టాలిన్ పూజలు
కొరుక్కుపేట: ప్రసిద్ది అంగలమ్మన్ ఆలయంలో సీఎం స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు . తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా మేల్మలయనూరు అంగలమ్మన్ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. రోజూ వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ మేలమ్మలయనూర్ అంగళమన్ ఆలయాన్ని సందర్శించారు. విల్లుపురం జిల్లా ట్రస్టీ కమిటీ చైర్మన్ సెల్వరాజ్, తిరుకోవిల్ హెల్ప్ కమిటీకి చెందిన జీవానందం, ట్రస్టీ కమిటీ చైర్మన్ మథియాల తదితరులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయానికి వెళ్లిన దుర్గా స్టాలిన్ ఆలయంలో అన్నపుటుస్వామి, మూలవర్ అంగాళమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
Comments
Please login to add a commentAdd a comment