టాస్మాక్ దుకాణాలను తొలగించాలని వినతి
వేలూరు: వేలూరులోని ఆర్కాడు రోడ్డులో ఉన్న మూడు టాస్మాక్ దుకాణాలను తొలగించాలని కోరుతూ వీసీకే కార్యకర్తలు కలెక్టర్ సుబ్బలక్ష్మి వద్ద వినతి పత్రం అందజేశారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో ప్రజా విన్నపాల దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతులు సమర్పించారు. ఈ సందర్బంగా వీసీకే ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్న విధంగా ఆర్కాడు రోడ్డులోని కాగిదపట్టరైలో ఒకే చోట మూడు టాస్మాక్ దుకాణాలు ఉండడంతో రోజూ మద్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యందారుల ఆగడాలు అరికట్టలేని పరిస్థితిలో ఉందన్నారు. టాస్మాక్ దుకాణం సమీపంలోనే ప్రైవేటు మెడికల్ కళాశాల, ప్రవేటు ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాల వంటివి ఉన్నందున రోజూ ఇతర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో రోగులు వచ్చి వెలుతున్నందున వెంటనే ఈ టాస్మాక్ దుకాణాలను తొలగించాలని అందులో కోరారు. వినతిపత్రం స్వీకరించిన కలెక్టర్ విచారణ జరిపి వాటిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కన్నింబాడి సమీపంలోని అమిర్థి రోడ్డుకు చెందిన గ్రామస్తులు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్న విధంగా తమ ఇల్లును జాతీయ రహదారుల శాఖ అధికారులు ధ్వంసం చేసేందుకు ఇది వరకే సర్వే చేసి వెళ్లారని వీటని నిలుపుదల చేయాలని కోరారు. అదేవిధంగా పలు సమస్యలపై ప్రజలు వినతీ పత్రాలను అందజేశారు. అనంతరం వికలాంగుల శాఖ, సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందజేశారు. వీటిలో డీఆర్‌ఓ మాలతి, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి శరవణన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment