ఓటింగ్‌కు సిద్ధం
సాక్షి, చైన్నె : ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో ఓటింగ్‌కు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బుధవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుంది. ఈవీఎంలు తదితర అన్ని రకాల సామాగ్రిని మంగళవారం సాయంత్రం సమయానికి పోలింగ్ బూత్‌లకు చేర్చారు. కాంగ్రెస్ సీనియర్, ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇలంగోవన్ మరణంతో ఈరోడ్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమైన విషయం తెలిసిందే. గత నెల కేంద్ర ఎన్నికల కమిషన్ నగారా మోగించింది. ఈ ఎన్నికలలో డీఎంకే అభ్యర్థిగా చంద్రకుమార్ పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే, బీజేపీ, డీఎండీకే, తమిళ వెట్రి కళగంలు ఎన్నికలను బహిష్కరించాయి. దీంతో డీఎంకే, సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్‌కట్చిఅభ్యర్థి సీతాలక్ష్మి మధ్య ప్రధాన సమరం నెలకొంది. వీరితో పాటూ 46 మంది పోటీలో ఉన్నారు. గెలుపు డీఎంకే వైపు ఏక పక్షంగా ఉన్నప్పటికీ, ఓట్ల చీలిక , మెజారిటీ తగ్గింపునకు నామ్ తమిళర్‌కట్చితో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు ఉరకలు తీస్తున్నారు. చంద్రకుమార్ గెలుపు బాధ్యతలను తన భుజాన వేసుకుని మంత్రి ముత్తుస్వామి నియోజకవర్గంలో తిష్ట వేసి ఉన్నారు. ఇక, తమ అభ్యర్థి ఓట్ల బలం కోసం సీమాన్ ప్రచారంలో ఉరకలు తీశారు.
నేడు ఓటింగ్
ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో 2,27,576 మంది ఓటర్లు ఉన్నారు, వీరిలో 1,10,128 మంది పురుషులు, 1,17,381 మంది మహిళలు, 37 మంది ఇతరులు ఉన్నారు. వీరు ఓటుహక్కు వినియోగించుకునేందుకు 53 ప్రదేశాలలో 237 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 85 ఏళ్లు పైబడిన 209 మంది, వికలాంగులు 47 మంది సహా మొత్తం 256 మంది ఓటర్లు పోస్టల్ ద్వారా ఓటు వేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 246 మంది పోస్టల్ ఓట్లు వేశారు. 46 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ప్రతి పోలింగ్ బూత్‌లో మూడు చొప్పున ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు. బుధవారం ఉదయం 6 గంటలకు మాక్ ఓటింగ్ చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు ముగిసిన తర్వాత, ఈవీఎంలను భారీ పోలీసు భద్రత మధ్య వాహనాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలకు తరలించేందుకు ఏర్పాట్ల చేశారు. ఇక్కడ 5 అంచెల పోలీసు భద్రత కల్పించారు. ఓటింగ్‌కు మరికొన్ని గంటలే సమయం ఉండటంతో నియెజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు జరిగాయి. పారా మిలటరీ, స్థానిక పోలీసులు నిఘాతో వ్యవహరిస్తున్నారు. గుర్తింపు కార్డులు, బూత్ స్లిప్పులు కలిగిన వారినే పోలింగ్ కేంద్రాల వైపుగా అనుమతించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రతి 8 నుంచి 10 పోలింగ్ బూత్‌లకు ఒకరు చొప్పున మొత్తం 24 మంది జోనల్ అధికారులను ఎన్నికల పర్యవేక్షణకు నియమించారు. వీరి పర్యవేక్షణలో ఈరోడ్‌కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఈవీఎంలు తదితర సామాగ్రినిని సాయంత్రం సమయానికి అన్ని పోలింగ్ బూత్‌లకు చేర్చారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ పనులను ఎన్నికల అధికారి, ఈరోడ్ కలెక్టర్ రాజగోపాల్ సుంకర, ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఎన్నికల అధికారి శ్రీకాంత్ పరిశీలించారు.
పారా మిలటరీ భద్రతా
నేడు ఈరోడ్ తూర్పులో పోలింగ్
నిఘా నీడలో పోలింగ్ బూత్‌లు
Comments
Please login to add a commentAdd a comment