సేలం: చెట్టు కొమ్మ నరుకుతూ కిందపడి బ్రెయిన్ డెడ్ అయిన పోలీసు అవయవాలను కుటుంబీకులు దానంగా ఇచ్చారు. దీంతో ఎనిమంది పునర్జన్మ పొందారు. మదురై తల్లాకుళం పోలీసు క్వార్టర్స్‌లో ఉంటున్న మోహన్ కుమార్ (31) సాయుధదళ పోలీస్. ఇతని భార్య యోగలక్ష్మి. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. జనవరి 30వ తేదీ సాయుధ దళం మైదానంలో చెట్టు కొమ్మను నరుకుతుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. వెంటనే ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి, తర్వాత మెరుగైన వైద్యం కోసం గత 4వ తేదీ మదురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో 5వ తేదీ రాత్రి మోహన్‌కుమార్ బ్రెయిన్ డెడ్ అయ్యింది. భార్య గురువారం మోహన్‌కుమార్ అవయవాల దానానికి అంగీకారం తెలిపారు. హృదయాన్ని చైన్నె ఎంజీఎం ఆస్పత్రికి, ఒక కిడ్నీ తిరుచ్చి కావేరి ఆస్పత్రికి, మరొక కిడ్నీ, కాలేయం, కళ్లు మదురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు దానం చేశారు. దీంతో అవయవదానంతో ఎనిమిది మంది పునర్జన్మ పొందారు. ఈ సంవత్సరం తొలి అవయవదానం అని, ప్రభుత్వ లాంఛనాల అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు.
నటుడు రిషికాంత్‌పై దాడి
–వ్యక్తి అరెస్ట్
తమిళసినిమా: సినీ నటుడిపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీమరాజా చిత్రంలో నటించిన రిషికాంత్(34). స్థానిక అభిరామపురంలో నివశిస్తున్నారు. రిషీకాంత్ శుక్రవారం ఉదయం స్థానిక నుంగంబాక్కమ్‌లోని స్టార్ గెస్ట్‌హౌస్‌లోని బార్‌కు వెళ్లి మద్యం తాగుతున్నాడు. కాగా అదే గెస్ట్‌హౌస్‌లో రిషీకాంత్‌కు పరిచయమైన స్థానిక తేనాంపేటలకు చెందిన కార్ షోరూంలో పని చేసే హరీష్ (33)అనే వ్యక్తి ఒక యువతితో కలిసి డాన్‌న్స్ చేశాడు. అయితే అతని డాన్స్‌ను రిషీకాంత్ హేళన చేశాడు. దీంతో హరీష్ కోపంతో అతని వద్దకు వెళ్లి గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో ఆ గెస్ట్‌హౌస్‌లోని బౌన్సర్లు వచ్చి ఇద్దరినీ అక్కడ నుంచి బయటకు పంపేశారు. అయితే బయటకు వచ్చిన తర్వాత హరీష్ రిషికాంత్‌తో మళ్లీ గొడవ పడి మద్యం మత్తులో కొట్టాడు. దీంతో రిషికాంత్ కంటి వద్ద గాయమైంది. వెంటనే అతను సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. విషయం తెలిసి తేనాంపేట పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి హరీష్‌ను అరెస్ట్ చేసి సంఘటనపై విచారణ జరుపుతున్నారు.
హార్బర్ల అనుసంధానికి చర్యలు
సాక్షి, చైన్నె: అంతర్జాతీయ స్థాయి హార్బర్‌లతో తమిళనాడులోని ప్రముఖ హార్బర్‌లను అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హార్బర్స్, షిప్పింగ్, జల రవాణాశాఖమంత్రి సర్బానంద సోనొవాల్ తెలిపారు. పార్లమెంట్‌లో డీఎంకే ఎంపీ గిరిరాజన్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి మాట్లాడుతూ సరకుల రవాణాలో, ఎగుమతి దిగుమతిలో హార్బర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. దేశంలోని హార్బర్‌లను పటిష్టం చేయడమే కాకుండా, తమిళానాడులోని హార్బర్ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 17 అంతర్జాతీయ హార్బర్‌లతో తమిళనాడులోని ప్రధాన హార్బర్‌లను అనుసంధానించేందుకు చర్యలు చేపట్టామని, ఇది ఆ రాష్ట్ర ప్రగతికి మరింత బలోపేతంగా నిలుస్తుందని అన్నారు.
ఫుట్‌పాత్ వ్యాపారులకు గొడుగులు
సాక్షి, చైన్నె: టీనగర్‌లోని ఫుట్‌పాత్ వ్యాపారులకు అతి పెద్ద గొడుగులను తమిళగ వెట్రి కళగం అందజేసింది. విజయ్ నేతృత్వంలో ఆ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా టి.నగర్‌లో శుక్రవారం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దక్షిణ చైన్నె ఉత్తర జిల్లా కార్యదర్శి అప్పు నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ హాజరయ్యారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే, టి.నగర్‌లోని పలు వీధుల్లో ఉన్న 1000 మంది ఫుట్‌పాత్ వ్యాపారులకు అతి పెద్ద గొడుగులను అందజేశారు.
28న పెరియార్ ఆస్పత్రి భవనం ప్రారంభం
మంత్రి సుబ్రమణియన్
కొరుక్కుపేట: అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న పెరియార్ నగర్ ఆస్పత్రి అదనపు భవనాన్ని ఫిబ్రవరి 28న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభిస్తారని మంత్రి ఎం.సుబ్రమణియన్ తెలిపారు. ఉత్తర చైన్నె అభివృద్ధి పథకం కింద పెరియార్‌నగర్ ప్రభుత్వ వైద్య కేంద్రానికి వైద్య పరికరాల కొనుగోలు కోసం తమిళనాడు వైద్య శాఖకు సీఎండీఏ నిధుల నుంచి రూ.84.17 కోట్లు విడుదల చేశారు. ఆ నిర్మాణ పనులను మంత్రులు ఎం.సుబ్రమణ్యన్, పి.కె.శేఖర్‌బాబు పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ ఆస్పత్రి వెనుక భాగంలో రోగుల కోసం ఆధునిక సౌకర్యాలతో అదనపు భవనాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ నెల 28న సీఎం స్టాలిన్ చేతులు మీదుగా ప్రారంభిస్తారని చెప్పారు. ఇందులో చైన్నె మేయర్ ప్రియ ఆరోగ్యశాఖ కార్యదర్శి సుప్రియ చాగు, హౌసింగ్ బోర్డు కార్యదర్శి కాకర్ల ఉష, జోనల్ కమిటీ అధ్యక్షురాలు సరిత, ఏరియా కార్యదర్శులు ఐసీఎఫ్ మురళి, నాగరాజన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment