●ల్యాండింగ్ కోసం గాల్లోనే విమానాలు చక్కర్లు ●ఆలస్యంగా నడిచిన రైళ్లు
సాక్షి, చైన్నె: కమ్మేసిన మంచు కారణంగా చైన్నెలో విమానాలు, రైళ్ల సేవలకు శుక్రవారం ఉదయం తీవ్ర ఆటంకం నెలకొంది. చైన్నె, శివారు జిల్లాలో వాతావరణం పూర్తిగా మారింది. చలి, మంచు, మధ్యాహ్నం వేళలో ఎండ అన్నట్టుగా వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు మూడు రోజులుగా మంచు ప్రభావం ఉదయం వేళలో అధికంగా ఉంది. ఈ పరిస్థితులలో శుక్రవారం ఉదయం మంచు దుప్పటి ఆకాశాన్ని కమ్మేసింది. దీంతో చైన్నె వైపుగా ఉదయాన్నే దక్షిణ తమిళనాడు, కొంగు మండలం వైపు నుంచి రావాల్సిన అనేక రైళ్లు సేవలకు ఆటంకం తప్పలేదు. పట్టాలు సైతం కనిపించని రీతిలో మంచు కప్పేయడంతో రైళ్లు నెమ్మదిగా ముందుకు సాగాయి. చెంగల్పట్టు, విల్లుపురం స్టేషన్ల మధ్య అనేకరైళ్లు ఆగాయి. చైన్నెకు సకాలంలో రావాల్సిన రైళ్లన్నీ ఆలస్యంగానే వచ్చి చేరాయి. అలాగే, మంచు దుప్పటి ప్రభావం విమానాల మీద సైతం పడింది. చైన్నెకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనేక విమానాలు ల్యాండింగ్ కోసం గాల్లోనే చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు మంచు దుప్పటి అధికంగా ఉండడంతో వాహన దారులు లైట్లు వేసుకుని ముందుకు సాగాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment